ములుగు ప్రజలకు కేటీఆర్‌‌ క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే సీతక్క

ములుగు ప్రజలకు కేటీఆర్‌‌ క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే సీతక్క

ములుగు/వెంకటాపూర్‌‌ (రామప్ప), వెలుగు: ‘ములుగు ప్రజలు తప్పు చేశారు’ అని మాట్లాడిన మంత్రి కేటీఆర్‌‌ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌‌ చేశారు. గురువారం స్థానిక క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే నీచంగా మాట్లాడడం సరికాదన్నారు. ‘సీతక్క అడిగితేనే మెడికల్‌‌ కాలేజీ ఇచ్చినం’ అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీశ్‌‌రావు చెప్పిన మాటలు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

ఉద్యమాలు మావి.. రాజభోగాలు మీవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లంపెల్లి, రాజుపేట, లక్ష్మీదేవి పేటను మండలం చేయాలనడం, గిరిజన యూనివర్సిటీలో క్లాస్‌‌లు ప్రారంభించాలనడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనడం, ములుగులో బస్టాండ్‌‌ నిర్మించాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. యూత్‌‌ కాంగ్రెస్‌‌ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్, బ్లాక్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌‌రెడ్డి, ఎండీ చాంద్‌‌ పాషా, వెంకటేశ్వర్లు, ఆకుతోట చంద్రమౌళి పాల్గొన్నారు.