ఊటీకి దీటుగా ములుగు అందాలు : మంత్రి సీతక్క

ఊటీకి దీటుగా ములుగు అందాలు : మంత్రి సీతక్క
  • వ్యూ పాయింట్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క 

తాడ్వాయి, వెలుగు : కుటుంబ సమేతంగా సరదాగా అటవీ అందాలను చూస్తూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించేందుకు ములుగు జిల్లా స్వాగతం పలుకుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శనివారం తాడ్వాయి మండలం పరిధి జలగలంచ వాగు ఏరియాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన అడవి అందాల వ్యూ పాయింట్ ను  మంత్రి ప్రారంభించి మాట్లాడారు.

జిల్లాలో బొగత జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. జలగలంచ వాగు వద్ద బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ , తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ  ఏర్పాటు చేశామని, పర్యాటకులను ఆకట్టుకునేలా ఊటీ, కొడైకెనాల్ పర్యాటక ప్రాంతాలకు దీటుగా తీర్చిదిద్దామన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అటవీ అధికారులు  పాల్గొన్నారు.

మేడారం అభివృద్ధి పనులు పరిశీలన 

వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏర్పాట్లు కల్పించాలని మంత్రి సీతక్క సూచించారు.  సమ్మక్క సారలమ్మను అధికారులతో కలిసి దర్శించుకున్నారు.  ముఖ్యమంత్రి  గద్దెల పునః ప్రారంభం చేస్తారని, విద్యుత్ లైట్లతో తీర్చిదిద్దాలని తెలిపారు.  పోలీసుల సమస్యలపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.