వరంగల్, వెలుగు: దసరా నవరాత్రులకు ముందే భద్రకాళి ఆలయంలో అమ్మవారిని ఊరేగించే రథం సిద్ధం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‍లో భద్రకాళి దేవాస్థాన పాలకమండలి సభ్యులతో నాయిని సమావేశమయ్యారు. అధికారులు మాట్లాడుతూ భద్రకాళి ఆలయ పరిసరాల్లో మాడవీధుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం రాజేందర్‍రెడ్డి మాట్లాడుతూ మాడవీధుల్లో ఊరేగే రథాన్ని భక్తుల ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో పెట్టుకుని అమ్మవారి దివ్యకళ, శిల్ప సంప్రదాయాలకు అనుగుణంగా హంగులతో రూపకల్పన చేయాలన్నారు.
భద్రకాళి ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం కావడంతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం తరఫున తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. సమావేశంలో పాలకమండలి చైర్మన్ శివసుబ్రమణ్యం, సభ్యులు గాదె శ్రవణ్‍రెడ్డి, గాండ్ల స్రవంతి, బింగి సతీశ్, తోపునూరి వీరన్న, అనంతుల వేణు, ఆలయ ఈవో సునీత, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఆలయ ప్రధానార్చకులు శేషు పాల్గొన్నారు.
