సిలిండర్ ధరలుపెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది

సిలిండర్ ధరలుపెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది

కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. స్వల్ప కాలంలోనే రెండుసార్లు రూ.50 చొప్పున సిలిండర్ ధరను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్ల క్రితం రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ రూ.1105కు చేరిందన్నారు. సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ చొప్పదండిలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లను రోడ్లపై పెట్టి..కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

గోదావరిఖనిలోనూ నిరసనలు

ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పెంచిన సిలిండర్ ధరలను నిరసిస్తూ గోదావరిఖని రాజీవ్ రహదారిపై టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్ పాల్గొని.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. పెంచిన గ్యాస్‌ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్  ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ సత్తుపల్లి మండలలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో గ్యాస్ సిలిండర్ల తో నిరసన తెలిపారు. రోడ్లపై గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ వంటా, వార్పు కార్యక్రమం నిర్వహించారు.