కడియంకు రాజయ్య టెన్షన్.. టికెట్​ ఖరారైనా తప్పని తలనొప్పి

కడియంకు రాజయ్య టెన్షన్..  టికెట్​ ఖరారైనా తప్పని తలనొప్పి
  • మాదిగల అండతో దూకుడు పెంచిన ఎమ్మెల్యే రాజయ్య
  • అదే టైంలో కడియంపై విమర్శల దాడి
  • మౌనం పాటిస్తున్న కడియం శ్రీహరి
  • స్టేషన్​ ఘన్​పూర్​ లో మెజారిటీ ఓట్లు మాదిగలవే
  • రసవత్తరంగా స్టేషన్​ రాజకీయం

జనగామ, వెలుగు: స్టేషన్​ ఘన్​పూర్​ రాజకీయం హాట్​ హాట్​గా మారింది. బీఆర్​ఎస్​ టికెట్​ దక్కినా కడియం శ్రీహరికి టెన్షన్​ తప్పడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీరు తలనొప్పి తెప్పిస్తున్నది. నియోజకవర్గంలో మాదిగల ఓట్లు కీలకంగా ఉండగా వారి మద్దతు తనకే ఉందని రాజయ్య దూకుడు పెంచుతున్నారు. తనకు మాదిగ వాసనంటే ప్రాణమంటూ సెంటిమెంట్​ రగిలిస్తున్నారు. ఇదే టైంలో ఏ మీటింగ్​ కు వెళ్లినా కడియం పై విమర్శల దాడి చేస్తున్నారు.

 పక్కా తెలంగాణ యాసలో పదునైన పదాలతో కామెంట్స్​ చేస్తున్నారు. టికెట్​ వార్​ చల్లబడుతుందనే అభిప్రాయం వచ్చే లోపు రాజయ్య ఏదో ఒక బాంబు పేలుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు కడియం రివర్స్​ కౌంటర్​ కామెంట్స్​ చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ఇరువురి తీరుతో పార్టీ శ్రేణులు డైలమాలో పడ్డాయి. కొన్ని రోజులుగా రాజయ్య తీరు పార్టీ మారుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ నుంచి రాజయ్య బరిలో ఉండడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. 

మాదిగల ఓట్లే కీలకం

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్​డ్​. ఇక్కడ మాలలతో పోలిస్తే మాదిగల ఓట్లు చాలా ఎక్కువ. నియోజకవర్గం మొత్తం 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్లు ఉండగా ఇందులో 85 వేల ఓట్లు ఎస్సీలవేనని అంచనా. వీటిలో మాదిగల ఓట్లు సుమారు 70 వేల వరకు ఉండగా మిగిలిన ఉపకులాలవి 15 వేల వరకు ఉంటాయని అంచనా. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. మాదిగ దండోరా నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకుంటారు. ఇదే క్రమంలో రాజయ్యకు రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనప్పుడల్లా ఎమ్మార్పీఎస్​ దాని అనుంబంధ సంఘాలు అండగా ఉంటూ వస్తున్నాయి. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే టికెట్ల లిస్టులో రాజయ్యకు చోటు దక్కకపోవడం పై కూడా మందకృష్ణ మాదిగ ఫైర్​ అయ్యారు.

ఇటీవల స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ కేంద్రంలో మాదిగల అస్తిత్వం.. ఆత్మగౌరవం పేరిట సభ పెట్టి కడియంపై విరుచుకుపడ్డారు. గుంటనక్క అంటూ విమర్శల దాడి చేశారు. మాదిగలంతా రాజయ్యకే అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్​ కు రాజయ్య హాజరు కాకపోయినప్పటికీ ఆయన ఎత్తుగడల్లో భాగంగా ఈ సమావేశం చేపట్టినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ ఇదే తీరుగా మాదిగల అస్తిత్వం.. ఆత్మగౌరవం పేరిట సోమవారం హన్మకొండలో జరిగిన మీటింగ్​కు రాజయ్య హాజరు కావడం.. అక్కడికి కాంగ్రెస్​ కీలక నేత దామోదర రాజనర్సింహా రావడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మాదిగల మద్దతు తనకే ఉందని రాజయ్య బలంగా నమ్ముతున్నారు. ఇదే నిజమైతే మాదిగల ఓట్లు ఎటు ఎక్కువ పడితే వారిదే పై చేయి కానుంది. 

కాంగ్రెస్​ వైపు చూపు..

రాజయ్య కాంగ్రెస్​లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే టాక్​ బలంగా వినిపిస్తోంది. అందుకే దామోదర రాజనర్సింహాతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మాదిగల అండ ఉందని, దీనికి పార్టీ ఓటు బ్యాంకు కూడా తోడైతే గెలుపు తనదేనని చెప్పినట్లు తెలుస్తోంది.  రాజనర్సింహా భేటీ నేపథ్యంలో జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన బీఆర్ఎస్​ హైకమాండ్​.. వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ను రాజయ్య ఇంటికి పంపి, బుజ్జగింపులు చేసింది. తర్వాత మీడియాతో మాట్లాడిన రాజయ్య తనకు పార్టీ హైకమాండ్ తప్పకుండా​ సముచిత స్థానం కల్పిస్తుందని, అందుకే తానింకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

ఇదిలా ఉండగా బీఆర్ఎస్​లో టికెట్ల ప్రకటన చేసిన రెండు రోజులకే  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి కేసీఆర్​ దూతగా రాజయ్యను కలిసేందుకు వచ్చినా రాజయ్య కలిసేందుకు ఆసక్తి చూపలేదు. తాజా పరిణామాలతో రాజయ్య స్టేషన్​ బరిలో నిలువడం ఖాయమనే ప్రచారం పెరిగింది. ఇదిలా ఉండగా, రాజయ్య కు కాంగ్రెస్​ వరంగల్​ ఎంపీ టికెట్​ ఆఫర్​ చేయగా సున్నితంగా తిరస్కరించి స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే టికెట్​ కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టేషన్​ టికెట్​ ఆశిస్తున్న సింగపురం ఇందిర కూడా  రాజయ్యకు వరుసకు చెల్లెలు. బంధుత్వం కూడా ఉన్నందున ఇందిరతో సంప్రదింపులు జరుపాలని కాంగ్రెస్​ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

కడియం వ్యూహాత్మక మౌనం

ఎమ్మెల్యే రాజయ్య నిత్యం కడియం శ్రీహరిపైమాటల దాడి చేస్తున్నారు. ‘కుప్ప పోసిన రాశి పై కుర్చుంటనంటే ఊరుకుంటన?  సొమ్మొకడిదైతే సోకొకడిద..? యాడనో ఉండి నేను చేసిన అభివృద్ధిని తాను చేసుకుంటున్నట్లు చెప్పుకుంటుండు’ అంటూ మండి పడుతున్నారు. ఆరు నూరైనా ప్రజా జీవితంలో ఉంటానని, ప్రజల మధ్యే చస్తానని చెబుతున్నారు. తన టికెట్​ విషయంలో హైకమాండ్​ పునరాలోచిస్తదని, ఇల్లు అలుకగానే పండగ కాదని, ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. మాదిగలంతా తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఇలా రాజయ్య ఎన్ని మాటలు అంటున్నా కడియం శ్రీహరి మౌనం వహిస్తున్నారు.

 అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత రెండు రోజులకు నియోజకవర్గ కేంద్రానికి భారీ ర్యాలీగా వచ్చిన కడియం నియోజకవర్గాన్ని అన్ని విధాల డెవలప్​ చేస్తానని అన్నారు. ఆ తదుపరి ఎక్కడా రాజయ్య తీరు పై స్పందించలేదు. సోమవారం వల్మిడీ రామాలయంలో విగ్రహ పున: ప్రతిష్టాపనకు వచ్చిన సందర్భంగా కడియం రాజయ్యలు పక్కపక్కనే కూర్చున్నారు. ఒక నవ్వు నవ్వుకున్నారు. మేమొక్కటే అని మీడియా ముందు ఏదో చెప్పబోయారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్​ లీడర్లతో టచ్​ లోకి వెళ్లిన రాజయ్య మేం వేరు వేరే అని సంకేతాలిచ్చారు. ఇదిలా ఉంటే హైకమాండ్​ సూచనలతోనే కడియం మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్​ ఖరారు కాక ముందు తరచూ మాటల తూటాలు పేల్చిన కడియం ఖరారయ్యాక పల్లెత్తు మాట అనక పోవడం వెనుక కచ్చితంగా హైకమాండ్​ ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.