అమ్రాబాద్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులు గౌస్, సందీప్, శ్రీను, వెంకటేశ్, మల్లేశ్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధితులకు ధైర్యం చెప్పి, తన వ్యక్తిగత నిధుల నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు ప్రభుత్వ పరంగా త్వరగా పరిహారం అందేలా చూడాలని కోరారు.
