
జన్నారం, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం జన్నారంలోని జ్యోతి గార్డెన్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు అందించారు. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామాల్లో రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించామని పేర్కొన్నారు.
జీవో 49ను అమలు చేస్తే రాజీనామా చేస్తా
అటవీ శాఖ అధికారులు 20 ఏండ్ల కింద చెట్లను తొలగించి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్అన్నారు. గత పదేండ్లలో వారి జోలికి వెళ్లకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. జీవో 49 విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం మళ్లీ ఆ జీవోను అమలు చేస్తే మొట్టమొదట తానే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. రేషన్ కార్డులు రాని వారు నిరాశ చెందవద్దని, మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ రాజామనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్ సహకారం సంఘం చైర్మన్ అల్ల రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ ఏపీఎంల బదిలీ
నస్పూర్, వెలుగు: ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తమ విధులు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 20 సెర్ప్ఏపీఎంలకు కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ చేశారు.