నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ రైతు వేదిక భవనంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. రసాయనాల వల్ల భూ కాలుష్యం పెరిగి, మానవ మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా కాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివ ర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఎరువుల వినియోగంతో భూసారానికి నష్టం

కోల్​బెల్ట్, వెలుగు: మోతాదుకు మించి ఎరువులను వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుదని  బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం) కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ అన్నారు. ‘రైతు ముంగిట్లో శాస్ర్తవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మందమర్రి మండలం సారంగపల్లిలోని రైతులకు అవగాహన కల్పించారు. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పెసర వేసుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు.

వరి, పత్తి మాత్రమే కాకుండా ఇతర అంతర పంటలు సాగుచేయాలని సూచించారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చులు తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలు వినియోగిం చడం, భూసారం రక్షణ, సాగునీటి ఆదా వంటి అంశాలపై శాస్ర్తవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్​అసిస్టెంట్​ డైరెక్టర్ బి.ప్రసాద్, శాస్త్రవేత్తలు డా.ప్రియ సుగంధి, డాక్టర్​ తిరుపతి, మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఉద్యాన శాఖ అధికారిణి కల్యాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు తిరుపతి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.