
- ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ఆదేశాలు
- డీపీఆర్సిద్ధం చేస్తున్న కన్సల్టెన్సీ
- రూ.40 కోట్ల అంచనా వ్యయం
- తీరనున్న డ్రైనేజీ, వరద నీటి ఇబ్బందులు
- మారనున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ రూపురేఖలు
కోల్‌బెల్ట్, వెలుగు: బొగ్గు గనుల ఆవిర్భావంతో ఏర్పడిన సింగరేణి కార్మిక క్షేత్రమైన క్యాతనపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడనుంది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రధాన కాలనీలతో పాటు మున్సిపల్ వార్డుల్లో డ్రైనేజీలు, వరద నీటి సమస్యలు శాశ్వతంగా దూరం కానున్నాయి. సింగరేణి బొగ్గు గనుల ఆవిర్భావంతో కార్మిక కుటుంబాలతో 50 ఏండ్ల కింద రామకృష్ణాపూర్ పట్టణం ఏర్పడింది. ఆటవీ ప్రాంతాన్ని ఆనుకొని కార్మిక కుటుంబాలు దగ్గరదగ్గరగా ఇండ్లు నిర్మించుకున్నారు. ఇరుకైన ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు నిర్మించారు. పూర్తిస్థాయి డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల–మందమర్రి నేషనల్హైవే 363కు ఇరువైపులా గద్దెరాగడి, తిమ్మాపూర్, క్యాతనపల్లి, కుర్మపల్లి పరిసరాల్లో పెద్ద సంఖ్యలో కాలనీలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు.
ఇండ్లలోకి చేరుతున్న వరద
చాలా వరకు మున్సిపల్ వార్డుల్లో డ్రైనేజీల కంపుకు తోడు ఏటా కురిసే వర్షపు నీరు ఉప్పొంగి ఇండ్లలోకి చేరుతోంది. గతేడాది భారీ వర్షాలతో పట్టణ వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. జనహర్, హనుమాన్‌నగర్ వెనుక వైపు, విఠల్‌నగర్-రైల్వే స్టేషన్ మార్గంలోని సబ్‌స్టేషన్‌లోకి భారీగా వరద చేరింది. సింగరేణి, మున్సిపల్‌శాఖలు సమస్యల పరిష్కారానికి ఏటా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో డ్రైనేజీ, వర్షపు నీరు సమస్యలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టి పెట్టారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవల మున్సిపల్ఆఫీసర్లను ఆదేశించారు.
నాలుగు వరద కాల్వలకు ప్రతిపాదనలు
ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ఆఫీసర్లు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో నాలుగు భారీ వరద కాల్వలను నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్గద్దె రాజు నేతృత్వంలోని మున్సిపల్ శాఖ, హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ సంయుక్తంగా డీపీఆర్ చేసే పనిలో పడ్డాయి. ప్రధానంగా ఏయే ప్రాంతాల గుండా డ్రైయినేజీలు వెళ్తున్నాయి, వరదతో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై సర్వే చేపట్టారు. డ్రైనేజీల ప్రవాహం, లోతు, వెడల్పు, వరద కాల్వల నిర్మాణం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేశారు.
కాల్వల నిర్మాణం ఇలా..
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే4 గడ్డ, సర్దార్వల్లబాయ్నగర్, అబ్రహం నగర్, బి జోన్వ్యాపార సముదాయాలు, విద్యానగర్, ఠాగూర్‌నగర్, రాజీవ్‌నగర్, పోచమ్మ బస్తీ, మల్లికార్జున్‌నగర్, ఏజోన్ సింగరేణి క్వార్టర్ల ఏరియా, శివాజీ నగర్ప్రాంతాల మీదుగా వెళ్లే భారీ డ్రైనేజీ, 20,6 వార్డుల పరిధిలోని భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాకు రెండు వైపులు సైతం రెండు భారీ డ్రైనేజీలు, 7,8,9 వార్డుల పరిధిలోని గద్దెరాగడి, అమ్మ గార్డెన్స్, ఆర్ఆర్కాలనీ, పాత, కొత్త తిమ్మాపూర్పరిసరాల్లో బహుళ అంతస్థుల ఇండ్లతో కొత్త కాలనీలు ఏర్పడిన ప్రాంతాల్లో మరో భారీ వరద కాల్వ నిర్మించాలని ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.
ఆర్కే4 గడ్డ నుంచి పలు వార్డుల గుండా శివాజీనగర్ శివారు వరకు సుమారు 7.3 కిలోమీటర్ల పొడవున 4 మీటర్ల వెడల్పు, 1.9 మీటర్ల లోతుతో కాల్వ నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. భగత్ సింగ్నగర్హట్స్ ఏరియా ముందు, వెనుక వైపు ప్రాంతాల్లో సుమారు 2 కి.మీ. పొడవున రెండు కాల్వలు, 8,9 వార్డుల పరిధిలోని అమ్మ గార్డెన్స్, గద్దెరాగడి, పెట్రోల్ బంక్, కొత్తగా నిర్మించే వాటర్ ట్యాంక్ ఏరియా, ఇతర కాలనీల మీదుగా సుమారు 4.5 కిలోమీటర్ల పొడవుతో మరో వర దకాల్వ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీ తుది దశకు చేరుకుంది.
డీపీఆర్సిద్ధం చేస్తున్నాం
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో క్యాతనపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల గుండా నాలుగు వరద కాల్వల నిర్మాణాలకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ, మున్సిపల్ శాఖ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేశాం. మరో 15 రోజుల్లో డీపీఆర్ పూర్తి చేసి నివేదికలను సర్కార్‌కు అందజేస్తాం.
గద్దెరాజు, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్