గాంధారి ఖిల్లాను.. టూరిజం స్పాట్​గా మారుస్తం : వివేక్ వెంకటస్వామి

గాంధారి ఖిల్లాను.. టూరిజం స్పాట్​గా మారుస్తం : వివేక్ వెంకటస్వామి
  • సీఎం రేవంత్​తో మాట్లాడి అభివృద్ధికి కృషి చేస్త:
  • ఖిల్లాను గత సర్కార్ పట్టించుకోలే
  • బీటీ రోడ్డు వేయించి..నీటి సౌలత్ కల్పిస్తానని హామీ
  • గాంధారి ఖిల్లా జాతరకు హాజరు

కోల్​బెల్ట్, వెలుగు: నాయక్​పోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ కొలువుదీరిన గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్​గా డెవలప్ చేసేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గాంధారి మైసమ్మ గొప్ప శక్తి స్వరూపిణి అని, పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఖిల్లాను సందర్శించానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చూడాలని మొక్కినట్టు గుర్తు చేశారు.

ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులో నిర్వహించిన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్​కు చీఫ్ గెస్ట్​గా హాజరై ఆయన మాట్లాడారు. ‘‘జాతర నిర్వహణ కోసం మంచిర్యాల కలెక్టర్​తో మాట్లాడి రూ.5లక్షలు సాంక్షన్ చేయించిన. జాతరకు రావాలని నాయక్​పోడ్ గిరిజన సేవా సంఘం సభ్యులు, స్థానికులు కోరారు. నాకు హెల్త్ బాగా లేదు..

అయినా ఓపిక చేసుకుని జాతరకు వచ్చిన. తెలంగాణ ఏర్పడి పదేండ్లు గడిచినా గాంధారి ఖిల్లా అభివృద్ధి జరగలేదు. బీటీ రోడ్డు కావాలని స్థానికులు అడుగుతున్నరు. ఫారెస్ట్ ఏరియా కావడంతో ఇబ్బంది అవుతున్నది. వచ్చే జాతర నాటికి బీటీ రోడ్డు వేయిస్తా. పర్మినెంట్​గా తాగునీటి సౌలత్ కల్పిస్త. గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్​గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతా..’’అని అన్నారు.

కాంగ్రెస్ సర్కార్​లో ప్రజాపాలన

కాంగ్రెస్ సర్కార్​లో ప్రజా పాలన కొనసాగుతున్నదని వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలంతా కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు. త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అమలు చేయనున్నట్టు తెలిపారు.

నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యేకు రూ.10కోట్ల చొప్పున కేటాయించారన్నారు. ‘‘ఎన్నికల ప్రచారం టైమ్​లో చెన్నూరు నియోజకవర్గంలోని అనేక సమస్యలు నా దృష్టికి వచ్చినయ్. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. గత సర్కార్ పట్టా ఇచ్చిన భూములను వాపస్ తీసుకున్నట్టు బొక్కలగుట్ట గ్రామస్తులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది. సీఎంను కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. చెన్నూరు, మంచిర్యాల ప్రాంతాల్లో బాలబాలికల కోసం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్ల ఏర్పాటుకు పాటుపడతా’’అని అన్నారు.

గాంధారి ఖిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై సంఘం సభ్యులు వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, క్యాతనపల్లి మున్సిపల్ చైర్​పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సీఐ శ్రీనివాస్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.