గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
  •     'గౌరవెల్లి' నిర్వాసితులు  ప్రతిపక్షాల మాయలో పడ్డరు
  •     పెండ్లయిన లేడీస్​కు ఎట్లిస్తం? 
  •     ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు సీఎంను అడుగుదాం
  •     హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ 

హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం కావాలంటే అడుక్కోవాలె గానీ కొట్లాడుడేందని హుస్నాబాద్​ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​ అన్నారు. పెండ్లయిన మహిళలు ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారని, వాళ్లకు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే అడుక్కుంటే కనికరిస్తారు గానీ లొల్లిచేస్తే సమస్య పెరుగుతుందన్నారు. ఈ నెల 20న హుస్నాబాద్​లో మంత్రి కేటీఆర్​ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆయన గురువారం హుస్నాబాద్, అక్కన్నపేటలో పార్టీ  కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు నిర్వాసితులతో కావాలనే లొల్లి చేయిస్తున్నాయని విమర్శించారు. 

ప్రాజెక్టుకు సంబంధించి 2017 నుంచి ఎకరాకు రూ. 6.95 లక్షల పరిహారం ఇచ్చేందుకు భూసేకరణ జరిగిందని, 84.07 ఎకరాలకు ప్రభుత్వం నుంచి  డబ్బులు మంజూరైనా, సదరు రైతులు పరిహారం తీసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా  ఎకరాకు రూ.15 లక్షల  ఇస్తామన్నా స్పందించడం లేదన్నారు. పెండ్లయిన మహిళలు ఆందోళనలు చేస్తే పైసలు రావని, ప్రాజెక్టు ప్రారంభంనాడు సీఎం కేసీఆర్​ను అడుగుదామన్నారు. హుస్నాబాద్​ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ బండి సంజయ్​ కేంద్రం నుంచి రూ.100కోట్లు తీసుకురావాలని సవాల్​ విసిరారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, హుస్నాబాద్​, అక్కన్నపేట ఎంపీపీలు లకావత్​ మానస,  మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, హుస్నాబాద్  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​ రజని పాల్గొన్నారు.