తెల్లారేసరికి ఇంటింటికి ఎమ్మెల్యే గడియారాలు

తెల్లారేసరికి ఇంటింటికి ఎమ్మెల్యే గడియారాలు
  • సుల్తానా బాద్‌‌లో న్యూ ఇయర్‌‌ గిఫ్టుల పేరుతో మున్సి పోల్స్‌‌ ప్రలోభాలు

సుల్తానాబాద్, వెలుగుఅది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. బుధవారం న్యూ ఇయర్ కావడంతో ముగ్గులేసేందుకు మహిళలు కొంచెం ముందే నిద్ర లేచారు. ఓ ఇంటావిడ తలుపులు తెరవగానే మెట్ల మీద గులాబీ రంగులో నిగనిగలాడుతున్న గోడ గడియారం కనిపించింది. క్లాక్‌‌ లోపల ఓవైపు సీఎం కేసీఆర్ సారు, ఇంకోవైపు ఆ సెగ్మెంట్‌‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌రెడ్డి ఫొటోలు. పక్కన కారు గుర్తు. గడియారాన్ని తీసుకొని ‘ఏమండోయ్..’ అనే లోపే పక్కింటావిడ చేతిలోనూ అలాంటి గడియారమే చూసి నోరెళ్లబెట్టింది. ఆ రెండు ఇండ్లే కాదు. ఏ క్రిస్‌‌మస్ తాతో వచ్చి ఓపిగ్గా పెట్టి వెళ్లినట్టు, ఆకాశం నుంచి గడపగడపన గడియారాల వానేదో కురిసినట్టు.. తెల్లారేసరికి వాడవాడలా అన్ని ఇండ్ల ముందరా ప్రత్యక్షమైన వాల్ క్లాక్‌‌లను చూసి సుల్తానాబాద్ జనాలు అవాక్కయ్యారు. ఆ గిఫ్టులు ఎందుకొచ్చాయో కాసేపట్లోనే పసిగట్టారు. ఫ్రీగానే వచ్చాయి గదా అని గోడలకు తగిలించుకున్నారు.  సీఎం కేసీఆర్, లోకల్‌‌ ఎమ్మెల్యే మనోహర్‌‌రెడ్డి ఫొటోలతో పాటు పక్కన కారు బొమ్మ ఉండేలా ఆల్రెడీ తయారు చేయించిన 4 వేల వాల్‌‌ క్లాక్‌‌లు 40 పెట్టెల్లో పెద్దపల్లి నుంచి మంగళవారం రాత్రి సుల్తానాబాద్ చేరాయి.

టీఆర్‌‌‌‌ఎస్ ఆశావహులు, ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు బుధవారం ఎర్లీ మార్నింగ్ రంగంలోకి దిగారు. 15 వార్డుల్లో తలా కొన్ని పంచుకొని ప్రతి ఇంటి ముందు ఒక్కో క్లాక్ పెట్టొచ్చారు. అప్పటికే లేచున్న వారి చేతుల్లో పెట్టి వెళ్లారు. టీఆర్‌‌‌‌ఎస్ పట్టణ లీడర్లంతా ఈ పనిలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. వెయ్యి క్లాక్‌‌‌‌లు తక్కువ పడగా మరో దఫా పంపిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మున్సిపోల్స్‌‌‌‌లో గెలిచేందుకు..?

పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి తర్వాత సుల్తానాబాద్ రెండో మున్సిపాలిటీ. గతంలో మేజర్ గ్రామపంచాయతీ.  ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీ హోదా ఇచ్చింది. పట్టణంలో15 వార్డులు, సుమారు 5 వేల ఇండ్లున్నాయి. జనాభా సుమారు 2‌‌‌‌‌‌‌‌0 వేలు. ఓటర్లు 15 వేలు. పంచాయతీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉంది. దీంతో సుల్తానాబాద్ పట్టణాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యతను లోకల్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌‌‌రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు.

కోడ్ ఉల్లంఘనే
ఇంటింటి కీ గడియారాలు పంచి టీఆర్‌ ఎస్‌‌‌‌ పార్టీ లీడర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా గిఫ్టుల ఆశచూపి ఓట్లు పొందాలనుకుంటున్నారు . ఆ పార్టీ ఆగడాలు సాగనివ్వం. బాధ్యులపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలె.

– అన్నయ్యగౌడ్, మాజీ సర్పంచ్