సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయించిన్రు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయించిన్రు: యెన్నం  శ్రీనివాస్ రెడ్డి
  •     ప్రభాకర్ రావు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తయ్
  •     ఆయన రాకుండా బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకుంటున్నారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్ ఫ్యామిలీ బాగోతాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని మహబూబ్​నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రావును ఇండియాకి తీసుకొచ్చి విచారిస్తే మరిన్ని అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కానీ.. ప్రభాకర్ రావును ఇండియాకు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లనే కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని తెలిపారు. మంగళవారం గాంధీభవన్​లో యెన్నం మీడియాతో మాట్లాడారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ఎక్విప్​మెంట్ దిగుమతి చేసుకున్నారు. వీటిని కొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే డబ్బులు ఇచ్చినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నయ్. గత బీఆర్ఎస్ సర్కార్​లోని మంత్రులు, ఎమ్మెల్సీలు అప్పటి అపోజిషన్ లీడర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేయించిన్రు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెల్ల చొక్కా వేసుకున్న రాజకీయ నేతలకు, ఖాకీ యూనిఫాం వేసుకున్న పోలీసుల నిబద్ధతకు పరీక్ష. మూడో సారి కూడా అధికారంలోకి రావాలనే అత్యాశతో బీఆర్​ఎస్ లీడర్లు ట్యాపింగ్ కు పాల్పడ్డరు. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిన్రు. డీజీపీకి మొదట కంప్లైంట్ చేసింది నేనే’’అని యెన్నం అన్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి: వంశీకృష్ణ

ఫోన్ ట్యాపింగ్​పై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం రేవంత్​ను కోరుతానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ‘‘నా ఫోన్ కూడా ట్యాప్ చేసిన్రు. ఇందులో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హస్తం ఉన్నది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన. కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్​లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్​కు వ్యతిరేకంగా మాట్లాడిన అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో 30 మంది బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది’’అని ఆరోపించారు.