మహబూబ్ నగర్ రూరల్/మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తోందని, అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు, ఆర్థిక భరోసా కల్పించే పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అతివేగమే ప్రమాదాలకు కారణం..
జిల్లా కేంద్రంలోని కొత్త రహదారులు, బైపాస్ రోడ్లపై అతివేగం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చర్యలు చేపడుతున్నట్లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బైపాస్ రోడ్లపై తక్షణమే స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ గన్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
