ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చండూరు (మర్రిగూడ), వెలుగు : మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం అధికార పార్టీ నుంచి 103 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ‘రాజీనామాతో ప్రభుత్వాన్నే మునుగోడుకు తీసుకొచ్చిన మొనగాడు కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి’ అని బీసీ కమిషన్‌‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లిలో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా పట్టించుకోని సీఎం కేసీఆర్‌‌.. రాజగోపాల్‌‌రెడ్డి రాజీనామా చేయగానే మునుగోడుకు వచ్చారన్నారు. కాంగ్రెస్‌‌ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్‌‌ విసిరారు. బతుకమ్మ సందర్భంగా మహిళలకు రూ. 60, రూ.70 చీరలే పంచారని, ఆ చీరలు పంటపొలాల్లో పక్షులను, జంతువులను బెదిరించేందుకు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెంట బీజేపీ క్యాండిడేట్‌‌  రాజగోపాల్‌‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి, తుల ఉమ, ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు ఉన్నారు. 

వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలి:కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట, వెలుగు: వృద్దుల సంక్షేమం కోసం అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పాటిల్ హేమంత్  కేశవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో  ఆయన ‘వయో వృద్ధుల సంక్షేమ చట్టం–-2007, దివ్యాంగుల హక్కుల చట్టం–-2016’ బుక్స్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో దివ్యాంగులు, వృద్ధులకు ఈ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.  వయోవృద్ధుల సంక్షేమం కోసం ​‘14567’,  దివ్యాంగుల కోసం ‘1800 - 5728980’ హెల్ప్ లైన్ నంబర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని , వారు ఉపయోగించుకోవాలని సూచించారు. అడిషనల్​కలెక్టర్ మోహన్ రావు, జిల్లా వెల్ఫేర్​ఆఫీసర్​జ్యోతి పద్మ,  ఆర్డీవో రాజేంద్ర కుమార్,  డీఆర్డీఏ పీడీ  కిరణ్ కుమార్  పాల్గొన్నారు. 

ప్రజా వాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి  దరఖాస్తులను  వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కి హాజరై ఆయన స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి ఒక్క అధికారి ఫిర్యాదుదారులకు రశీదు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.  రెవెన్యూ శాఖకు 46 , పింఛన్ల కోసం30 దరఖాస్తులు  వచ్చినట్లు తెలిపారు.  

పిల్లలకు డీఈసీ టాబ్లెట్లు వేయాలి
యాదాద్రి, వెలుగు: పైలేరియా నివారణ కోసం జిల్లాలో రెండేండ్లు నిండిన 7,06,411 మంది పిల్లలకు  డీఈసీ టాబ్లెట్లు వేయాలని యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ఎల్​ఎఫ్​ మాస్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ జిల్లా టాస్క్​ఫోర్స్​ మీటింగ్​లో మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 22 వరకు డీఈసీ టాబ్లెట్లు ఇంటింటికి తిరిగి వేస్తారని తెలిపారు. పంపిణీ కోసం 3,146 మంది సిబ్బందిని, 315 సూపర్​వైజర్లను నియమించామని చెప్పారు. జిల్లాలో పైలేరియా బాధితులైన 2010 మంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీటింగ్​లో డాక్టర్లు చిన్నానాయక్, వినోద్, మధుమోహన్​రావు, డీడబ్ల్యూవో కృష్ణవేణి, యాదయ్య, నోడల్ ఆఫీసర్​ రమణి ఉన్నారు.  

ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
చండూరు, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వానికి మునుగోడు బైఎలక్షన్​పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం పై లేదని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. సోమవారం చండూరులో ఉడతలపల్లి, తుమ్మలపల్లి టీడీపీ ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. ఎన్నికల పేరుతో రాష్ట్ర మంత్రులందరూ మునుగోడులో తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధిని పట్టించుకోని టీఆర్ఎస్ ను ఓడించేందుకు టీడీపీ పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు ఓటమి తప్పదని ఐలయ్య చెప్పారు. కార్యక్రమంలో   లింగయ్య,  ఎండీ షరీఫ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో ‘ఫసల్ బీమా’ అమలు చేయాలి:బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి 
నేరేడుచర్ల, వెలుగు: ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ, కిసాన్​మోర్చా ఆధ్వర్యంలో వర్షాలకు దెబ్బ తిన్న పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం నేరేడుచర్ల పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫసల్​బీమాను రాష్ట్రంలో అమలు చేయకుండా సీఎం కేసీఆర్​రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. ఎరువులపై కేంద్ర ప్రభుత్వం రూ.2.50 లక్షల కోట్ల సబ్సిడీ భారం భరిస్తున్నా.. రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. అంతకు ముందు ‘కిసాన్​సమ్మాన్​నిధి’ రిలీజ్​చేసినందుకు  మోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ  నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ యాదవ్,  సత్యనారాయణ రెడ్డి,  వెంకటేశ్వర్లు,  పత్తిపాటి విజయ్ పాల్గొన్నారు. 

బహుజన రాజ్యాధికారంతోనే అన్ని వర్గాల అభివృద్ధి
మిర్యాలగూడ, వెలుగు : ఆర్ధిక, రాజకీయ సమానత్వం, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి  సాధించాలంటే బహుజన రాజ్యాధికారంతోనే సాధ్యమని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య అన్నారు. ఎంసీపీఐయూ నేత, మాజీ ఎమ్మెల్యే మద్దికాయ ఓంకార్  వర్ధంతి సభను సోమవారం మిర్యాలగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టయ్య మాట్లాడుతూ ఓంకార్​ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  బీసీలకు చేసిన సేవలు మరువొద్దన్నారు. 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల అమలుకు  వెంటనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కులగణన చేపట్టాలని డిమాండ్​ చేశారు.  ఏఐఎఫ్​డీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మ,   గోపి తదితరులు పాల్గొన్నారు.  

బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటా
యాదాద్రి, వెలుగు: పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా  అండగా ఉంటానని భువనగిరి మున్సిపల్​ బీజేపీ ఫ్లోర్​ లీడర్​ మాయ దశరథ చెప్పారు. తన బర్త్​డే సందర్భంగా పలుచోట్ల   అన్నదానం, పండ్లు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. బీజేపీ బలోపేతం కోసం ఎంతో మంది కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారికి తన శక్తి మేరకు సాయం చేస్తానని ప్రకటించారు. ముందుగా బర్త్​డే కేక్​కట్​చేశారు. చందా మహేందర్​ గుప్తా, జనగాం కవిత, రత్నపురం బలరాం పాల్గొన్నారు.  

బీజేపీలో చేరికలు
యాదాద్రి, వెలుగు: చౌటుప్పల్​మండలం జై కేసారంలో  సోమవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. చేరిన వారికి  డీకే అరుణ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం  ఆమె మాట్లాడుతూ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్​ లీడర్​ గూడూరు నారాయణ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్​గౌడ్​ ఉన్నారు.