ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యేల సమీక్ష..పెండింగ్ పనుల పూర్తికి ఆదేశాలు : హరీశ్రావు, కొత్త ప్రభాకర్

ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యేల సమీక్ష..పెండింగ్ పనుల పూర్తికి ఆదేశాలు : హరీశ్రావు, కొత్త ప్రభాకర్

సిద్దిపేట, వెలుగు: రంగనాయక సాగర్  రిజర్వాయర్ వద్ద  నీటిపారుదల శాఖ ఆఫీసులో బుధవారం సిద్దిపేట, దుబ్బాక నియోజకర్గాల సాగునీటి సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యేలు హరీశ్​రావు, కొత్త ప్రభాకర్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ యాసంగిలో  పంట పొలాలు ఎండిపోతున్నాయని వెంటనే రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి, దుబ్బాక ప్రధాన కాల్వతో పాటు కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

రంగనాయక సాగర్  కుడి కాల్వ కెనాల్ లో తుంగ, గడ్డిని వెంటనే తొలగించి ఈ నెల13న  నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. చంద్లాపూర్ లిఫ్ట్ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంబించాలని, ఇర్కోడ్ లిఫ్ట్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. చిన్నకోడూరు మండలం గోపులా పూర్, కస్తూరి పల్లి గ్రామాల వద్ద నిర్మించే చెక్ డ్యామ్ పనులు వెంటనే ప్రారంభించాలని, అల్లీపూర్  వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను హరీశ్ రావు ఆదేశించారు.

అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అల్లీపూర్ కర్ణాల కుంటకు నీళ్లు వచ్చేలా లిఫ్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అందుకు ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

ఐటీ టవర్ ను సందర్శించిన హరీశ్ రావు

 సిద్దిపేట ఐటీ టవర్ ను హరీశ్ రావు సందర్శించి ఉద్యోగస్తులతో ముచ్చటించారు. ఐటీ టవర్ లో సౌకర్యాలు అడిగి తెలుసుకొని సమస్యలను  దృష్టికి రాగా అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎక్కడ చదువు కున్నారో అక్కడే ఉద్యోగం సంపాదించాలనే మీ తపనకు ఉద్యోగం చేయాలనే మీ ఆలోచనల కోసమే  సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేశామన్నారు.

సిద్దిపేట ఐటీ టవర్ లో 17 కంపెనీలున్నాయని, 350 మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారని, ఐటీ టవర్ లోని టాస్క్ సెంటర్ లో నిరంతరం ట్రైనింగ్ జరుగుతుందని స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీ టవర్ లో పని చేసే సెక్యూరిటీతో పాటు  ఇతర వర్కర్స్ కీ జీతాలు రావడం లేదని వెంటనే జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.