రైతుల ఉసురు తగిలి.. కేసీఆర్ సర్కారు కూల్తది

రైతుల ఉసురు తగిలి.. కేసీఆర్ సర్కారు కూల్తది

ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ రావు
 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ


మెదక్, వెలుగు: రైతుల ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ ​కుటుంబాన్ని శనివారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఆయన పరామర్శించారు. వారికి కోటి రూపాయల పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రమని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చివరికి నేడు రాష్ట్రాన్ని రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తెచ్చారని విమర్శించారు. ‘‘సమృద్ధిగా వానలు పడ్డ వేళ ఇప్పుడు వరిసాగు వద్దనుడు విడ్డూరం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉచితంగా పొలాలకు నీళ్లిస్తున్నమని గొప్పలు చెప్పి, ఇప్పుడు పుష్కలంగా నీళ్లున్నా వరి వేయొద్దని హుకుం జారీ చేసే అధికారం ఎవరిచ్చిన్రు? రైతుల సాదకబాధకాల మీద అవగాహన లేక కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ఆయన రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం రైతుల కన్నీళ్లు, శవాలతో తల్లడిల్లుతున్నది. రైతు పక్షపాతినని చెప్పుకునే సీఎం వాళ్లు చస్తుంటే ఏం చేస్తుండు? ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడయి. తాను వానాకాలం వడ్లను కొనకుండా యాసంగి వడ్లపై కేంద్రన్ని బద్నాం చేద్దామనుకుంటుండు. మేనిఫెస్టో అంటే ఖురాన్, భగవద్గీత, బైబిల్​ లెక్క. 2018 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నడు. కేసీఆర్ కుర్చీ కాపాడుకునేందుకు పాకులాడుతున్నారు తప్ప ప్రజల కోసం పని చేస్తలేడు”అని ఫైర్​ అయ్యారు. 

సీఎంకు పరామర్శించే టైమ్ లేదా?

ఢిల్లీలో మరణించిన వేరే రాష్ట్రాల రైతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ప్రకటించిన సీఎంకు సొంత జిల్లాలో రైతు మరణిస్తే పరామర్శించే టైమ్ లేదని రఘునందన్ రావు దుయ్యబట్టారు. ‘‘ఉమ్మడి ఏపీలో చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాదిరిగా ఇప్పుడు తెలంగాణలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని  అన్నారు. బాబుకు కేసీఆర్ కు తేడా లేదు” అని అన్నారు. రైతు కుటుంబ సభ్యులకు ఈటల, రఘునందన్ రావ్ రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.