సైకిల్పై తిరిగినోళ్లకు రూ. లక్షల కోట్ల ఆస్తులెక్కడివి ? హరీష్, కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్

సైకిల్పై తిరిగినోళ్లకు రూ. లక్షల కోట్ల ఆస్తులెక్కడివి ? హరీష్, కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్
  • దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు ట్యాక్స్ అసెస్ మెంట్లు బయటపెట్టాలి
  • మాజీ మంత్రి హరీశ్​ రావు వంద శాతం బీజేపీ ఏజెంట్‍ 
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు కామెంట్స్

వరంగల్‍, వెలుగు: తెలంగాణ రాకముందు సైకిల్‍పై తిరిగిన మాజీ మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్‍, సంతోష్‍రావుకు రూ. లక్షల కోట్ల ఆస్తులెక్కడివని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్ నాగరాజు ప్రశ్నించారు. వారు వైట్‍ కాలర్‍ క్రిమినల్స్ అని, వాళ్లకు తోడుగా వరంగల్ జిల్లాలో వినయ్‍భాస్కర్‍ వంటి నలుగురు తోడు దొంగలు అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్‍ తనకు మంచి మిత్రుడని.. ఇప్పటికైనా కబ్జాలు, దోపిడీలు, దోచుకోవడాలు ఆపాలని లేదంటే ప్రజల ఉసురు తాకుతుందని హితవు పలికారు.

బుధవారం హనుమకొండలోని కాంగ్రెస్‍ భవన్ లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ నేతలతో కలిసి ప్రెస్‍మీట్‍ నిర్వహించి వారు మాట్లాడారు. సీసీఐపై కనీస అవగాహన లేకుండా హరీశ్​ఏనుమాముల మార్కెట్ లో మాట్లాడాడని విమర్శించారు.  కల్వకుంట్ల కవిత ఇచ్చే షాక్ లకు హరీశ్ కోమాలోకి వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. 600 ఎకరాల్లో ఫామ్‍ హౌజ్‍, వరంగల్‍ సూపర్‍ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో రూ.600 కోట్ల అవినీతి చేశాడని, స్వయంగా ఇంటిమనిషి కవితనే మీడియాకు చెప్పిందని పేర్కొన్నారు.

కల్వకుంట్ల కుటుంబానికి సొంత పేపర్లు, టీవీ చానళ్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.  దమ్ముంటే ట్యాక్స్ అసెస్‍మెంట్లు బయటపెట్టాలని సవాల్‍ విసిరారు. హరీశ్ కు​100 శాతం బీజేపీ ఏజెంట్‍ అని, ఆ పార్టీ నేతల మద్దతుతోనే అక్రమంగా ఆస్తులు సంపాదించాడని ఆరోపించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ తమ కమీషన్ల కోసం అభివృద్ధి పేరుతో ఎక్కడాలేని విధంగా11 శాతం వడ్డీతో అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలను మోసగించిందని మండిపడ్డారు.

గత వరదలప్పుడు రూ.10 వేలు ఇవ్వలేని భయంతోనే కేటీఆర్‍ ఈసారి వరద బాధితుల పరామర్శకు రాలేదని విమర్శించారు. సీఎం రేవంత్‍రెడ్డి రూ.15 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తుంటే బీఆర్‍ఎస్‍ నేతలు జీర్ణించుకోవట్లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జనాలు బీఆర్‍ఎస్‍ కు బుద్ధి చెప్పినా కేటీఆర్‍కు అహంకారం తగ్గట్లేదని విమర్శించారు. ఈ సమావేశంలో వరంగల్‍ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, నేతలు పాల్గొన్నారు.