ప్రశాంతంగా ఎమ్మెల్సీ బై పోల్​

ప్రశాంతంగా ఎమ్మెల్సీ బై పోల్​
  • ఉమ్మడి పాలమూరులోని పది సెంటర్లలో 99.86 శాతం పోలింగ్​ నమోదు
  • ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్​లో ఓటేసిన సీఎం రేవంత్​రెడ్డి
  • క్యాంపుల నుంచి డైరెక్ట్​గా బస్సుల్లో పోలింగ్​ బూత్​లకు వచ్చిన లోకల్​ బాడీస్​ ప్రజాప్రతినిధులు

మహబూబ్​నగర్/గద్వాల/నాగర్​కర్నూల్​/వనపర్తి, వెలుగు: మహబూబ్​నగర్​లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ముందు నుంచీ అనుకున్నట్లే ఓటర్లంతా క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్​ సెంటర్లకు ప్రత్యేక బస్సులు, స్పెషల్​ వెహికల్స్​లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,439 ఓట్లకు 1,437 ఓట్లు పోల్ అవగా, 99.86 శాతం ఓటింగ్​ నమోదైంది. సీఎం రేవంత్​రెడ్డి ఎక్స్​ అఫీషియో హోదాలో కొడంగల్​లో ఓటు వేశారు. పోలింగ్​కు కొద్ది నిమిషాల ముందు ఓటర్లకు  బీఆర్ఎస్​ అభ్యర్థి పంచినట్లుగా చెప్తున్న  గోల్డ్ ​కాయిన్స్ ​సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఎనిమిది సెంటర్లలో వంద శాతం పోలింగ్​

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి  మన్నే జీవన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నుంచి ​ నవీన్​ రెడ్డి,  సుదర్శన్​​ గౌడ్​ బరిలో నిలిచారు. క్యాంపెయినింగ్​కు సుదర్శన్​ గౌడ్​ దూరంగా ఉండడంతో జీవన్, నవీన్​ మధ్యే ప్రధాన పోటీ నడిచింది.  బై పోల్​ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్​, కొడంగల్​, నారాయణపేట, షాద్​నగర్​, నాగర్​కర్నూల్​, అచ్చంపేట, వనపర్తి, కల్వకుర్తి, గద్వాల, కొల్లాపూర్​లలో పోలింగ్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో నాగర్​కర్నూల్, నారాయణపేట సెంటర్లు మినహా అన్ని చోట్లా వంద శాతం పోలింగ్​ రికార్డయ్యింది. నాగర్​కర్నూల్​ సెం టర్​లో 101 మంది ఓటర్లకు వంద ఓట్లు పోలయ్యాయి. నారాయణపేటలో 205 ఓటర్లకు 204 మంది ఓట్లు వేశారు. కొల్లాపూర్​ పోలింగ్​ కేంద్రంలో 67 మందికి 67 మంది, అచ్చంపేటలో 79 మందికి 79, కల్వకుర్తిలో 72 మందికి 72, షాద్​నగర్​171 మందికి 171, వనపర్తిలో 218 మందికి 218, గద్వాలలో 225 మందికి 225, పాలమూరులో 245 ఓటర్లకు గాను 254 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్​ ప్రక్రియ కొనసాగగా, షాద్​నగర్​, కొడంగల్​ పోలింగ్​ స్టేషన్​లలో మధ్యాహ్నం రెండు గంటలకే వంద శాతం పోలింగ్​ నమోదైంది. మిగిలిన సెంటర్లలో నాలుగు గంటల వరకు కొనసాగింది. 

క్యాంపుల నుంచి డైరెక్ట్​గా బస్సుల్లో సెంటర్లకు..

ఎనిమిది రోజులుగా లోకల్​ బాడీస్​ ప్రజాప్రతినిధులు క్యాంపుల్లో ఉన్నారు. క్రాస్​ ఓటింగ్​ జరుగుతుందనే ఉద్దేశంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు ఆయా పార్టీల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్​ కౌన్సిలర్లను గోవా, ఊటీ, కొడైకెనాల్​, నెల్లూరు తదితర ప్రాంతాలకు తరలించారు. బుధవారం వీరు ఆ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరినా..  క్రాస్​ ఓటింగ్​ జరుగుందనే భయంతో క్యాండిడేట్లు వీరిని ఉదయం పోలింగ్​ జరిగే సమయం వరకు రిసార్ట్స్​లో ఉంచారు. ప్రధానంగా మహబూబ్​నగర్, నారాయణపేట, కొడంగల్​, గద్వాల ప్రాంతాలకు చెందిన ఓటర్లను రాయచూర్​ ప్రాంతంలోని కొన్ని రిసార్టుల్లో ఉంచగా.. అచ్చంపేట, కొల్లాపూర్​, వనపర్తి, షాద్​నగర్​, కల్వకుర్తి, నాగర్​కర్నూల్​ ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్​లోని రిసార్ట్స్​లో ఉంచినట్లు తెలిసింది. వీరిని ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఆయా ప్రాంతాల్లోని రిసార్ట్స్​ నుంచి పోలింగ్​ సెంటర్లకు తరలించారు. అన్ని సెంటర్లలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కేవలం 15 శాతం నుంచి 25  శాతంలోపే పోలింగ్​ పర్సంటేజ్​ నమోదైంది. పది గంటల తర్వాత  ఒక్కొక్క బ్యాచ్​గా ఓటర్లు బస్సులు దిగుతూ పోలింగ్​ సెంటర్​లోకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని సెంటర్లలో దాదాపు 70 శాతానికి పైగా పోలింగ్​ నమోదైంది. ఆ తర్వాత రెండు గంటల వరకు కొన్ని సెంటర్లలో వంద శాతం పూర్తి కాగా, మిగిలిన సెంటర్లలో నాలుగు గంటల వరకు వంద శాతం పోలింగ్​ నమోదైంది. 

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

ఎమ్మెల్సీ బై పోల్​ సందర్భంగా ఎక్స్​ ఆఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​లో మధ్యాహ్నం రెండు గంటలకు ఓటు హక్కును వినిగించుకున్నారు. ఓటు వేసేందుకు ఆయన హైదరాబాద్​ నుంచి రోడ్డు మార్గాన కొడంగల్​ చేరుకొని ఓటు వేశారు. అనంతరం ఆయన నివాసంలో కాంగ్రెస్​ పార్టీ ముఖ్య కార్యకర్తలు, లీడర్లతో పార్లమెంట్​ ఎన్నికలపై ఆ పార్టీ మహబూబ్​నగర్​ పార్లమెంట్​ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్​లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్​నగర్​లో ఎంపీ మన్నే శ్రీనివాస్​ రెడ్డి, మహబూబ్​నగర్​, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, నాగర్​కర్నూల్​లో ఎంపీ రాములు, లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్​ కూచుకుళ్ల రాజేశ్​ రెడ్డి, కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేటలో ఎమ్మెల్యే డాక్టర్​ వంశీకృష్ణ, షాద్​నగర్​లో ఎమ్మెల్సీ వాణీదేవి, వీర్లపల్లి శంకర్​, నారాయణపేటలో మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు వాటికి శ్రీహరి, డాక్టర్​ పర్నికారెడ్డి, గద్వాలలో ఎమ్మెల్సీ చల్లా వంశీచంద్​ రెడ్డి, గద్వాల, అలంపూర్​ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి, విజేయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్​కు ఇద్దరు ఎంపీటీసీలు దూరం

బై పోల్స్​లో 1,439 మంది ఓటర్లుండగా, 1,437 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు పోల్ కాలేదు. ఈ రెండు ఓట్లు మహిళలవే. వీరిద్దరూ ఎంపీటీసీలే. ఇందులో ఒకరు మక్తల్​ మండలం మంథన్​గోడ్​కు చెందిన బీజేపీ​ ఎంపీటీసీ గున్న సువర్ణ. ఈమెకు హెల్త్​ ఇష్యూస్​ ఉండడంతో ఏడాదిగా పూణెలో ఉంటున్నారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఈమెకు డబ్బులు ఆఫర్​ చేసి ఓటు వేయడానికి రావాలని కోరినా, బీజేపీ క్యాండిడేట్​ పోటీలో లేకపోకపోవడంతో తాను పోలింగ్​కు దూరంగా ఉంటున్నట్లు సమాధానమిచ్చినట్లు తెలిసింది. మరో ఎంపీటీసీ బిజినేపల్లి మండలం గుడ్లనర్వకు చెందిన ఎంపీటీసీ సురభి శారద. ఇమె కొంత కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఈ కారణంగానే  ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు తెలిసింది.