
కాగజ్ నగర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల మేలు కోరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 49 జీవో అమలు నిలిపి వేశారని, ప్రతిపక్షాలు చెప్తున్నట్లు జీవో మళ్లీ అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కాగజ్ నగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. జీవోను నిలిపివేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిం దని, ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోందని పేర్కొన్నారు. కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ సర్కారును కోరిందని గుర్తుచేశారు. కేంద్రం, ఎన్టీసీఏ ఒత్తిడితోనే రాష్ట్ర అటవీ శాఖ జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన అడ్డంకిగా మారాయని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దమ్ముంటే ఆర్డినెన్స్ ఆపాలి: సోయం బాపురావు
మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చేతకాని మాటలు కాకుండా ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి ఆర్డినెన్స్ రాకుండా ఆపాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం జీవో 49 అమలు కాదని వెల్లడించారు. ప్రధాని వేరే దేశాల ముందు గొప్పలు పోయేందుకు నేషనల్ టైగర్ కారిడార్ ఏర్పాటు చేసేలా పాకులాడుతున్నారని ఆరోపించారు. జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి, మాజీ ఎంపీపీ నానయ్య, మాజీ జడ్పీ టీసీ రామారావు, నాయకులు పాల్గొన్నారు.