MLC Elections : చదివింది పదో తరగతి.. వేసింది గ్రాడ్యుయేట్ ఓటు

MLC Elections : చదివింది పదో తరగతి.. వేసింది గ్రాడ్యుయేట్ ఓటు

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా... టీడీపీ, వైఎస్ఆర్పీసీ మధ్య అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ దొంగ ఓట్లకు పాల్పడుతుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అర్హత లేని వారిని కూడా తీసుకొచ్చి ఓటు వేయిస్తు్న్నారని విమర్శలు గుప్పిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. మిరపకాయలు ఏరటానికి వెళ్తున్న  ఓ మహిళకి  ఎమ్మెల్సీ ఓటు హక్కు ఇవ్వడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె చదివింది పదో తరగతే. అయినా గ్రాడ్యుయేట్ ఓటు వేసేందుకు అర్హత సాధించింది. ఉపాధ్యాయల ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా వైసీపీకి ఓటు వేయటానికి వచ్చిన ఫేక్ గ్రాడ్యుయేట్ ఓటర్ ను గుర్తించిన ప్రతిపక్షాలు.. ఆమెను అక్కడే నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఆమె పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టు తెలిపింది. తాను ఎలాంటి డిగ్రీ చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మీరు వేయబోయేది ఏం ఎన్నికలు అని అడిగినా ... దానికీ ఆమె దగ్గర సమాధానం లేదు. కనీసం ఆమెకు అసలు దేనికి ఎన్నికలు అన్న విషయం కూడా తెలియకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓటింగ్ స్లిప్ ను తమ కాలనీలో వాలంటీర్ ఇచ్చారని ఆమె చెప్పింది. కేవలం పదో తరగతి చదువుకున్న ఆమెకు గ్రాడ్యుయేట్ ఓటు హక్కుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.