టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో ‘ఎమ్మెల్సీ’ టెన్షన్!

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో ‘ఎమ్మెల్సీ’ టెన్షన్!
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ సీట్లపై టెన్షన్
  • సర్కారుపై గుర్రుగా సొంత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు
  • వాళ్లను చల్లబర్చేందుకు రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను వెంటాడుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని చోట్ల అదే రిజల్ట్‌‌‌‌‌‌‌‌ రిపీట్‌‌‌‌‌‌‌‌ అవుతుందేమోనని అధికార పార్టీ హైరానా పడుతోంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ సీట్లపై టెన్షన్‌‌‌‌‌‌‌‌ పడుతోంది. సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడే ఆస్కారముందని ఆందోళన చెందుతోంది. క్యాంపుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. దీంతో ఎన్నికలు జరుగుతున్న 6 సీట్లను గెలిపించుకోవడానికి పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఓటర్లలో అసంతృప్తి చల్లార్చే చర్యలు చేపట్టారు. క్యాంపుల్లో ఉన్నోళ్లంతా పార్టీ అభ్యర్థులకే ఓటు వేసేలా ఆయా క్యాంపుల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలకు ఆదేశాలిస్తున్నారు.

సొంత నేతల్లోనే వ్యతిరేకత
స్థానిక సంస్థల కోటాలో జనవరి నాలుగో తేదీతో ఖాళీ అయ్యే 12 స్థానాలకు గత నెలలో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో రెండు చొప్పున, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో సీటు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రెండు స్థానాలకు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో స్థానానికి ఈనెల 10న పోలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాల్సి ఉంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కే చెందిన సైదాపూర్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. రెబల్స్‌‌‌‌‌‌‌‌గా పోటీలో నిలిచారు. వీరితో పాటు ఇంకో ఆరుగురు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ నేతలను కలిసి తనకు మద్దతునివ్వాలని రవీందర్ సింగ్ అభ్యర్థించారు. సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి భానుప్రసాద్‌‌‌‌‌‌‌‌ రావుపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉంది. ఇది తమ పుట్టి ముంచుతుందేమోనని అధికార పార్టీ టెన్షన్‌‌‌‌‌‌‌‌ పడుతోంది.

ఓటర్ల ఫ్యామిలీలతో సంప్రదింపులు
ఖమ్మంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తాతా మధుకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గోవా క్యాంపులో ఉన్న ఈ జిల్లా ఓటర్లను అదే జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రభావితం చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ను ఓడించడానికి సదరు నేతలు ఓటర్ల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని, దీని ప్రభావం ఓటింగ్‌‌‌‌‌‌‌‌పై పడొచ్చని అనుమానిస్తున్నారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే తరహా ఆందోళనలో గులాబీ పార్టీ నేతలు ఉన్నారు. ఇక్కడ కూడా పార్టీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌పై కొంత వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. దీంతో సీఎం స్వయంగా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడినట్టు తెలిసింది. నల్గొండ జిల్లా ఓటర్లను సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తున్నారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టును చూపించి, 8న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివార్లలోని ఒక రిసార్టులో ఓటు వేసే విధానంపై వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ తమ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవని నేతలు ధీమాగా చెప్తున్నారు. మెదక్‌‌‌‌‌‌‌‌ సీటును కూడా గెలుచుకుంటామని అంటున్నారు.

క్రాస్ ఓటింగ్ భయం
కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీలకు కలిపి 300 వరకు ఓట్లున్నాయి. ఎక్కువ మంది ఓటర్లు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ రెబల్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌కే ఓటేసే అవకాశముంది. దీనికి తోడు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు భానుప్రసాద్‌‌‌‌‌‌‌‌రావును వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నియోజవర్గాలకు చెందిన ఓటర్లు భారీగా క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడే ఆస్కారముందని ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్గాలు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఓటర్లను కొందరు నేతలు ప్రభావితం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా గుర్తించిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థలకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన రూ.500 కోట్లల్లో రూ.250 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు భారీ నజరానా ఇచ్చి వారిలోని అసంతృప్తిని చల్లార్చే పనిలో పడింది. ముఖ్యంగా క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడవచ్చనే సమాచారం ఉన్న నేతలకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఒక క్యాంపులోని ఓటర్ల సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను అక్కడ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలుగా ఉన్న నేతలు లాక్కోవడం వివాదాస్పదమైంది. తమ ఫోన్లు తిరిగి ఇచ్చేయాలని ఓటర్లు ఆందోళనకు దిగడం, ఈ వ్యవహారం పార్టీ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు చేరడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు.

ముందు నజరానాలు.. తర్వాతే ఓట్లు
క్యాంపుల్లో ఉన్న ఓటర్లు ముందు తమకు నజరానా ఇచ్చిన తర్వాతే ఓట్లు వేస్తామని పట్టుబడుతున్నారు. తాము ఎన్నికయ్యేందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు పెట్టామని, ఒక్క రూపాయి కూడా నిధులు రాని ఈ పోస్టు ఎందుకని ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కనీసం అభివృద్ధి నిధులైనా ఉన్నాయని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్లు ఉంటే తప్ప తమను పట్టించుకోవడం లేదని, ఇప్పుడు తప్ప తమకు మరో అవకాశం రాదు కాబట్టి పైసలు ఇచ్చి తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నారు. వీరికి ఈనెల 8, 9 తేదీల్లో ఇవ్వాల్సిన మొత్తం ముట్టజెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఒక్కో ఎంపీటీసీకి రూ.5 లక్షల వరకు, జెడ్పీటీసీలకు రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇంత చేసినా వాళ్లు పార్టీకే ఓటు వేస్తారా.. క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడే ఆస్కారముందా అనే దానిపై నిఘా వేయాలని పార్టీ నాయకత్వం క్యాంపుల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. నగదు ఇచ్చినా వేరే వాళ్లకు ఓటు వేసే అవకాశమున్న వారిని గుర్తించి వారితో ఆయా జిల్లా మంత్రులు, ఎంపీలు మాట్లాడి బుజ్జగించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.