ఒక క్వింటాల్‌‌కు 5 కిలోల ధాన్యం దోపిడీ

ఒక క్వింటాల్‌‌కు 5 కిలోల ధాన్యం దోపిడీ

నాంపల్లి: రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుందని అసత్యాలు చెబుతోందని ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక క్వింటాల్ ధాన్యంలో నుంచి 5 కేజీలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి క్వింటాల్‌‌ మీద రైతులు వంద రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు రూ.5 వేలలో మిల్లర్లే రూ.2,500 దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హమాలీ ఛార్జీలు రైతులే భరించాలా?
‘ఆనాడు హమాలీల ఛార్జీ అయిన రూ.11ను ప్రభుత్వమే భరించేది. రైతులు రూ.5 కట్టేవారు. కానీ ఇప్పుడు హమాలీల ఛార్జీలను ప్రభుత్వం భరించడం లేదు. ఎలక్ట్రానిక్ వేవ్ బ్రీజ్‌‌పై ప్రభుత్వానికి విశ్వాసం ఉందా? మిల్లర్లను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది. మిల్లర్ల ఆలోచనలకు అణుగుణంగా సర్కార్ పని చేస్తోంది. ఎలక్ట్రానిక్ వేవ్ బ్రీజ్ రసీదుపై ధాన్యం కొనుగోలు చేయాలి’ అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

అలుకుడు విధానంతో రైతులకు నష్టం
‘గతంలో సన్న వడ్లు అని రైతాంగాన్ని దివాళా తీయించారు. అలుకులు జల్లే విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ విధానంతో ధాన్యం తక్కువ వస్తుంది. గతంలో ముఖ్యమంత్రి నిర్ణయంతో రైతులు రూ.10 వేలు నష్టపోయారు. అలుకులు జల్లే విధానాన్ని తీసుకొస్తే మరోసారి రైతులు పది వేలు నష్టపోయే ప్రమాదం ఉంది. రైతు లేనిదే రైతు కూలీలు లేరు. కూలీలు లేనిదే రైతులు లేరు’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.