
కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో మార్పుకు సంకేతమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మే 13వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. బీజేపీ, జేడీఎస్ ఎన్ని కుట్రలు పన్నినా కర్ణాటక ప్రజలు అవినీతి ప్రభుత్వానికి చరమ గీతం పలికారని వెల్లడించారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని జీవన్ రెడ్డి జోష్యం చెప్పారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం కన్నా తెలంగాణలో అవినీతి రెట్టింపుగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులే కాకుండా..కాంగ్రెస్ పాలనలో వేసిన జాతి సంపదైన ఔటర్ రింగ్ రోడ్ ను కూడా అమ్మకానికి పెట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు జీవన్ రెడ్డి. కాగా, కాంగ్రెస్ పై విశ్వాసం ప్రకటించిన కర్ణాటక ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారాయన.