
కేటీఆర్ కేవలం మునుగోడుకు మాత్రమే మంత్రి కాదని, రాష్ట్రం మొత్తానికి మంత్రినన్న విషయాన్ని మర్చిపోవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యతలు తప్ప నిధులు లేవన్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేస్తే నిధులు రాక స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని తెలిపారు. రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఉందన్నారు. అభివృద్ధి పనుల నిధుల చెల్లింపు పై ప్రత్యేక సమావేశం నిర్వహించి వెంటనే నిధులు విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడును సిరిసిల్లా లాగా డెవలప్ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్... ప్రచారంలో భాగంగా ఈ హామీ ఇచ్చారు.