ముంపు గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ముంపు గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

గంగాధర, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్​ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన నారాయణపూర్, ఇస్తారిపల్లిని పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. రిజర్వాయర్​కు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి, తర్వాత గ్రామస్తులతో మాట్లాడారు. నారాయణపూర్ ​రిజర్వాయర్​కు గండి పడి ఐదు నెలలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని జీవన్​రెడ్డి మండిపడ్డారు.

రిజర్వాయర్ కింద ఉన్న ఊళ్లను ముంపు గ్రామాలుగా ప్రకటించి, పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మత్తడి ఎత్తు పెంచితే ఆ ప్రభావం కట్టపై పడుతుందని చెప్పారు. ముంపు సమస్య పురావృతమైతే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్​ ప్రజల బతుకులతో ఆడుకోకుండా ఆదుకోవాలన్నారు. నెలరోజులు వరదనీటితో ఇబ్బందులు పడ్డామని నారాయణపూర్, ఇస్తారిపల్లి గ్రామస్తులు ఏడుస్తూ చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు మనోహర్, బుచ్చయ్య, ప్రభాకర్, కరీం, శ్రీనివాస్, నాగేందర్​రెడ్డి, నజీర్, రాజేశం ఉన్నారు.