బంగారు తెలంగాణలో పుట్టబోయే బిడ్డకు లక్ష అప్పు

బంగారు తెలంగాణలో పుట్టబోయే బిడ్డకు లక్ష అప్పు

జగిత్యాల, వెలుగు: ఎందరో ఉద్యమకారుల బలిదానాలతో ఏర్పాటు చేసుకున్న బంగారు తెలంగాణలో పుట్టబోయే బిడ్డకు సైతం లక్ష అప్పు చేసిన ఘనత కేసీఆర్​కు దక్కుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల్లో 40 శాతం ఖాళీలు ఉన్నా ఉద్యోగాలెందుకు ఇస్తలేరో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఉద్యమం సమయంలో కాంట్రాక్ట్ వ్యవస్థ రూపుమాపుతామన్నారని, ఇప్పుడు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం అవినీతి సామ్రాజ్యం పెంచుకోవడానికే రాష్ట్ర ఏర్పాటు జరిగినట్లు కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. దళిత రైతులకు ఒక్క ఎకరం పంచలేదని పేర్కొన్నారు. ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించిందని బాధ పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.