సంజయ్​ను చేర్చుకోవడంపై జీవన్​ రెడ్డి మనస్తాపం

సంజయ్​ను చేర్చుకోవడంపై జీవన్​ రెడ్డి మనస్తాపం

జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంజయ్ చేరికపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో సంజయ్ కాంగ్రెస్​లో చేరారు. ఈ విషయం తెలిసి జీవన్​రెడ్డి అనుచరులు, పార్టీ  కార్యకర్తలు సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంటికి చేరుకున్నారు. పార్టీలో సీనియర్ అయిన జీవన్​రెడ్డి అభిప్రాయం తీసుకోకుండానే జిల్లాకు సంబంధించి ఇంతపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు. 

అనుకోకుండా.. అభివృద్ధి కోసం..

జగిత్యాల నియోజకవర్గంలో డబుల్ ​బెడ్​రూం ఇండ్ల కాలనీలో సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో కూడా ఆయన సీఎం రేవంత్​రెడ్డిని కలిసి రోడ్ల విస్తరణ, రోళ్ల  వాగు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. అప్పట్లోనే సంజయ్ కాంగ్రెస్​లో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అప్పుడు సంజయ్ ​ఈ ప్రచారాన్ని ఖండించారు. 

తిరిగి అభివృద్ధి నిధులతో పాటు, ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల ప్రతిపాదనలకు సంబంధించి రూ.85 కోట్లు మంజూరు చేయాలంటూ ఆదివారం ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్​లో కలిశారు. అక్కడే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్​లో చేరాలని సంజయ్ కుమార్ ను కోరగా, తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సంజయ్ చెప్పినట్టు తెలిసింది. 

పార్టీలోకి రావాలని.. తగిన గుర్తింపు ఇస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా భరోసా ఇవ్వడంతో అప్పటికప్పుడు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు తెలుస్తున్నది. నిధుల కోసం వెళ్లి అనుకోకుండా.. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్​లో చేరాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డబుల్ బెడ్ రూం లబ్ధిదారులతో టెలికాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు.

జీవన్​రెడ్డితో శ్రీధర్​బాబు భేటీ

ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్​లో చేరికతో జీవన్​రెడ్డితోపాటు ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుసుకున్న మంత్రి శ్రీధర్​బాబు సోమవారం సాయంత్రం జగిత్యాలకు చేరుకొని ఆయన్ను కలిశారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ విప్​లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్​ఉన్నారు. రెండు గంటలపాటు సుదీర్ఘంగా జీవన్​రెడ్డితో చర్చించారు. తర్వాత శ్రీధర్​బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్​కు పెద్దదిక్కుగా ఉన్న జీవన్​రెడ్డి మనస్తాపానికి గురికావద్దని కోరారు. 

కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేమని చెప్పారు. జీవన్​రెడ్డికి న్యాయం జరిగేలా సీఎం రేవంత్​రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తర్వాత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశామని, చేరికపై హైకమాండ్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఆందోళన చెందుతున్నారని వివరించారు. జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించామన్నారు.