ఢిల్లీలో కేసీఆర్ అప్పుల అన్వేషణలో బిజీ

ఢిల్లీలో కేసీఆర్ అప్పుల అన్వేషణలో బిజీ
  • వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన

ధర్మపురి (జగిత్యాల జిల్లా): ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ అప్పుల అన్వేషణలో బిజీగా ఉన్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మత్స్యకారులు, రైతులను, నిరుపేదలను ఆదుకునేందుకు  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో వర్షాలు, వరదలతో పంట నష్టం అయిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు. గోదావరి వరదల్లో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి..రైతులను పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు, వరదతలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న తరుణంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకుని అప్పుల అన్వేషణలో బిజీ అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీలో కేవలం అప్పుల వేటకే పరిమితం కాకుండా రాష్ట్రానికి వర్షాలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వర్షాలు, వరదలతో రైతులే కాదు.. మత్స్యకారులు, సామాన్య నిరుపేదలు కూడా నష్టపోయారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరిగిన వరదలు, పంట నష్టంపై కేంద్రానికి నివేదికలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. వర్షాలు, వరదల బాధితులను ఆదుకోవాల్సిందేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.