
ఫామ్ హౌస్ లు కాదు.. ఫాంలు కావాలన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గవర్నర్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కన్నా , దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని కవిత ట్వీట్ లో పేర్కొన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపైనే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నాము అని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్ లో రాసుకొచ్చారు.
అంతకుముందు గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూనే పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు.. అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకారం అందిస్తోందని .. రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.