సీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలి : తరుణ్ చుగ్

సీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలి  :  తరుణ్ చుగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, కేజ్రీవాల్ ప్రభుత్వం పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. సీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, కవిత.. పదే పదే ఢిల్లీకి ఎందుకు వచ్చారో కూడా చెప్పాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న తరుణ్ చుగ్ ..సీబీఐ విచారణకు కవిత సహకరించాలని కోరారు.

అటు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షహీ కవితకు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్​లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 14మందిపై ఐపీసీ సెక్షన్ 477‌‌ఏ కేసు నమోదైందని సీబీఐ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో కవితకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. 

సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు నోటీసులు అందినట్లు వెల్లడించారు. హైదరాబాద్​లో తన నివాసంలోనే ఈనెల 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని రిప్లయ్​ ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.