కేసీఆర్ వెంట ములాయం అంత్యక్రియలకు వెళ్లిన కవిత

కేసీఆర్ వెంట ములాయం అంత్యక్రియలకు వెళ్లిన కవిత
  • ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరు 
  • అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం.. మూడ్రోజులు అక్కడే 
  • బీఆర్ఎస్ ఆఫీస్ పరిశీలన.. వాస్తుకు అనుగుణంగా రిపేర్లపై సూచనలు

హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు రావడంతో ఎమ్మెల్సీ కవిత అమెరికా టూర్​కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా.. మంగళవారం ఆమె ఉత్తరప్రదేశ్​లో కనిపించారు. సమాజ్‌‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌‌ మాజీ సీఎం ములాయం సింగ్‌‌ యాదవ్‌‌ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్​తో కలిసి కవిత పాల్గొన్నారు. హైదరాబాద్​ నుంచి కేసీఆర్, కవిత, ఎంపీ సంతోశ్​​కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్, పార్టీ నేత శ్రవణ్ కుమార్ ప్రత్యేక విమానంలో యూపీ చేరుకున్న వీడియోలను సీఎంవో రిలీజ్​ చేసింది. ములాయం సొంతూరు ఇటావా జిల్లా సైఫయికి చేరుకున్న కేసీఆర్.. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అఖిలేశ్‌‌ యాదవ్‌‌, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంత్యక్రియలు తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కోసం తీసుకున్న కొత్త ఆఫీసును సందర్శించారు. వాస్తుకు అనుగుణంగా పార్టీ కార్యాలయంలో చేయాల్సిన రిపేర్లపై సిబ్బందికి సూచనలు చేశారు. పది రోజుల క్రితం కేటీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా సర్దార్ పటేల్ మార్గ్ లోని జోధ్ పూర్‌‌ వంశీయుల కేత్రి ట్రస్టు బంగ్లాను బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఏడాది పాటు లీజుకు తీసుకున్నారు. ఇందుకోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వసంత్ కుంజ్​లో టీఆర్ఎస్ భవనం నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ కార్యకలాపాలు ఇక్కడి నుంచి జరగనున్నాయి. కాగా, కేసీఆర్‌‌ మూడ్రోజులు ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీఆర్ఎస్ పై పలు పార్టీల నాయకులతో కేసీఆర్ చర్చిస్తారని సమాచారం.