ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి .. ఏపీ సీఎం చంద్రబాబుకు కవిత లేఖ

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి .. ఏపీ సీఎం చంద్రబాబుకు కవిత లేఖ

హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న  యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. పోలవరం ముంపు పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చీకటి ఆర్డినెన్స్​ ద్వారా 2014లో ఏపీలో విలీనం చేయించుకున్నారని ఆరోపించారు. గురువారం ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడు మండలాలను విలీనం చేయించుకోవడం ద్వారా సీలేరు పవర్​ప్లాంట్​ను లాగేసుకుని రాష్ట్రంలో కరెంట్​ కష్టాలకు కారణమయ్యారని విమర్శించారు.  

ఏకపక్ష విలీనంతో ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భద్రాచలం రాములవారి గుడి మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామపరిధిలో ఉన్నాయని, రాములవారు తెలంగాణలో ఉంటే ఆయన భూములు ఏపీలో ఉండడంతో భూముల్లో ఇష్టారాజ్యంగా కబ్జాలు కొనసాగుతున్నాయని వివరించారు.