
జీడిమెట్ల, వెలుగు: గాజులరామారంలో ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేదలకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే బుల్డోజర్కు తాను అడ్డం పడతానని చెప్పారు. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని సోమవారం ఆమె పరిశీలించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కబ్జాలు జరిగాయని, సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టకూడదని కోర్టు స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా పేదల ఇండ్లను కూల్చడం దారుణమని విమర్శించారు. అరికెపూడి గాంధీ లాంటి పెద్దలు చేసిన కబ్జాలను వదిలేసి, హైడ్రా పేదలపై విరుచుకుపడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన కబ్జా చేసిన 12 ఎకరాల భూమి సంగతేంటని, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని సవాల్ విసిరారు.
ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ అని.. అలాంటి పండుగ రోజు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇవ్వకపోవడం బాధాకరమని కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు రెండు చీరలు ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు కేవలం మహిళా సంఘాల సభ్యులకే ఇస్తుండం కరెక్ట్ కాదన్నారు.