కేసీఆర్​ బీఆర్‌‌ఎస్‌‌ ప్రకటన బీజేపీని గడగడలాడించింది : ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్​ బీఆర్‌‌ఎస్‌‌ ప్రకటన బీజేపీని గడగడలాడించింది : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలడిగితే తప్పకుండా జవాబు చెప్తామని, కానీ మీడియాకు లీకులిచ్చి నాయకుల మంచి పేరు చెడగొట్టాలని చూస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘కాదు.. కూడదు.. జైల్లో పెడ్తమంటే.. పెట్టుకో. ఏమైతది..? భయపడేదేముంది..? ఎక్కువలెక్కువ ఏం చేస్తరు.. ఉరెక్కిస్తరా? ఎక్కువలెక్కువంటే జైల్లో పెడ్తరు.. అంతేకదా.. పెట్టుకోండి..? ఏమైతది..” అని ప్రశ్నించారు. 

గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదేండ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టారని, అడ్డదారుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని కవిత ఆరోపించారు. ‘‘ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చేకన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్​లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది. ఇది నార్మల్​. నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావొచ్చు.. ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ. ఇందులో ఏం లేదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

తాము ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని, ప్రజల అండ ఉన్నంత కాలం ఎవరికీ ఏమీ ఇబ్బందిరాదని చెప్పారు. ‘‘ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రావాలే తప్ప.. ఈడీ, సీబీఐని ప్రయోగించి గెలవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సాధ్యపడదు” అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అక్రమ మార్గాల్లో కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతున్నదని, అలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ కుట్రను బట్టబయలు చేసినందుకే తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని కవిత మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. 

కేసీఆర్​  ప్రకటన బీజేపీని గడగడలాడించింది

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌గా మార్చుతున్నట్టు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రకటన బీజేపీని గడగడలాడించిందని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటును జీర్ణించుకోలేక చవకబారు రాజకీయాలకు తెరతీసిందని కవిత ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసినందుకే కక్షసాధింపులకు దిగుతున్నదని ఆరోపించారు. విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సైన్యం ముందు పనిచేయవని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర, కుటిల రాజకీయాలను పాతర పెట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలదని ఆమె తెలిపారు.