వామ్మో పులి!..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవుల్లో సంచారం

వామ్మో పులి!..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవుల్లో సంచారం
  • రేణ్యతండా సమీపంలో 
  • పాద ముద్రలను గుర్తించిన ఆఫీసర్లు

మహబూబాబాద్/కొత్తగూడ​, వెలుగు : మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలం రేణ్య తండా అటవీ ప్రాంత ప్రజల్లో వామ్మో పులి భయం పట్టుకుంది. ములుగు జిల్లా పరిధి అటవీ ప్రాంతం నుంచి మగ పులి మేటింగ్​కోసం మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్​, కర్నెగండి, పూనుగొండ్ల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. సమీప గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. 

వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా, ఇతర పనులకు ఒంటరిగా బయటకు వెళ్లేందుకు సాహసించడంలేదు.  ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్​కావడంతో అటవీ ప్రాంతంలోంచి వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. పులి జాడ తెలుసుకునేందుకు గురువారం ఫారెస్ట్​ఆఫీసర్లు పాద ముద్రల గుర్తించారు.  ట్రాప్ కెమెరాలను  ఏర్పాటు చేశారు. 

 కొత్తగూడ అటవీ ప్రాంతంలో మగ పులి సంచరిస్తున్నట్లుగా  సమాచారం ఉందని, రేణ్య తండా సమీపంలో దాని పాద ముద్రలను గుర్తించినట్టు కొత్తగూడఫారెస్ట్​ రేంజ్​ఆఫీసర్​-వజహత్ ​తెలిపారు.  అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.  ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు  గ్రామాల్లో డప్పు చాటింపు చేయించామని పేర్కొన్నారు.  

అటవీ ప్రాంతం కావడంతో 2021, డిసెంబర్ లో  పులి సంచరించిందని,  మళ్లీ ఇప్పుడు ఆనవాళ్లు కనిపించినట్టు తెలిపారు. అది జిల్లా అడవులను దాటి పోయే వరకు వేచి చూడాల్సిందేనని, ప్రజలెవరూ దానికి ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచించారు.