అమ్రాబాద్, వెలుగు : నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మండారి సైదులు, రాణి దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గురువారం తండ్రి పనిమీద బయటకు వెళ్లగా.. తల్లి ఇంటిపనుల్లో ఉంది.
రెండున్నరేళ్ల చిన్నారి జానశ్రీ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడింది. ఆలస్యంగా చూసిన తల్లి గ్రామస్తుల సాయంతో బయటకు తీయగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
