- ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా బొగ్గు గనుల్లో డిసెంబర్లో 77 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. గురువారం జీఎం ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా వివరాలు వెల్లడించారు. ఏరియా పరిధిలో 2,57,500 టన్నుల టార్గెట్‌కు గాను 77 శాతంతో 1,97,521 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు.
కేకే-5 గనిలో 20వేల టన్నులకు 20,526 టన్నులు (103 శాతం), కాసిపేట-2 గనిలో 80 శాతం, కేకే ఓసీపీలో 1,90,000 టన్నులకు 1,49,751 టన్నులు (79 శాతం), కాసిపేట గనిలో 65 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక బొగ్గు ఉత్పత్తి అన్నారు. శాంతిఖని గనిలో రెండు నెలలుగా జెఎంఎస్ ప్రైవేటు కంపెనీ బొగ్గు ఉత్పత్తి నిలిచివేసిందని, 67కిలోమీటర్ల మేర బొగ్గు ఉత్పత్తిని తీయాల్సి ఉండగా కేవలం 10 కిలోమీటర్ల మాత్రమే పూర్తి చేసిందన్నారు.
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆదేశాలతో సింగరేణి, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా కార్మిక కాలనీల్లో అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏరియా ఏస్వోటు జీఎం జీఎల్ ప్రసాద్, డీజీఎం(పర్సనల్) సీహెచ్ అశోక్, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవత్ ఝా, డీజీఎంలు కిరణ్‌కుమార్, ప్రసాద్, కేకే ఓసీపీ పీవో మల్లయ్య, మేనేజర్రామరాజు పాల్గొన్నారు.
నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి
నస్పూర్, వెలుగు: 2025–26 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. గురువారం జీఎం ఆఫీసులో మీడియాతోమాట్లాడారు. డిసెంబర్ నెలలో ఆర్కే 5 గని 100 శాతం, ఆర్కే 7 గని 90 శాతం, ఆర్కే న్యూటెక్ గని 112 శాతం, ఎస్సార్పీ 1 గని 110 శాతం, ఎస్సార్పీ 3, 3ఏ గని 82 శాతం, ఐకే1ఏ గని 97 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 95 శాతం ఉత్పత్తి సాధించాయని తెలిపారు. ఎస్సార్పీ ఓసీపీ 34 శాతం, ఐకే ఓసీపీ 75 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 57 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు.
ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలన్నారు. కంపెనీ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాధిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఏరియాలో 4333 మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ కాగా 3791మందికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారయణ, డీజీఎం(పి) అనిల్ కుమార్, ఐఈడీ రాజన్న, సీనియర్ పీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
