జనవరి 3న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

జనవరి 3న  కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్
  •     పవన్  సిఫార్సులతో అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులు
  •     భక్తుల కోసం 100 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మాణం 
  •     ప్రజా ప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ
  •     అనంతరం జేఎన్టీయూలో రివ్యూ
  •     ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు

జగిత్యాల/ కొండగట్టు, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్  కల్యాణ్  శనివారం కొండగట్టులో పర్యటించనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 100 గదుల కాంప్లెక్స్​ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం జేఎన్టీయూ కాలేజీలో అధికారులతో ఆలయ అభివృద్ధిపై రివ్యూ చేస్తారు. పవన్​కల్యాణ్​ పర్యటనకు జిల్లా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రూ.35 కోట్ల టీటీడీ నిధులు..

గతంలో వారాహి పూజ సందర్భంగా కొండగట్టుకు వచ్చిన పవన్  కల్యాణ్‌కు స్థానిక నాయకులు, అధికారులు, అర్చకులు ఆలయంలో అవసరమైన సౌలతుల గురించి వివరించారు. స్పందించిన ఆయన డిప్యూటీ సీఎం హోదాలో రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో వంద గదులతో భక్తుల కోసం ధర్మశాల, ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేందుకు అనుగుణంగా మాల విరమణ మండపం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు.

కొండగట్టు అంజన్నపై అపార నమ్మకం.. 

పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్నపై అపారమైన భక్తి, నమ్మకం ఉన్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు అంజన్నను దర్శించుకున్నారు. గతంలో కొండగట్టుకు వచ్చి వెళ్తుండగా, కరెంట్ షాక్ కు గురై బయటపడడంతో అంజన్న దయ తనపై ఉండడం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని పలుమార్లు చెప్పారు. 

జనసేన ఏర్పాటు అనంతరం ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘వారాహి’ ప్రచార రథానికి కొండగట్టులో పూజలు నిర్వహించి ఏపీకి వెళ్లారు. అదే వాహనంలో ప్రచారం చేసి పవన్ కల్యాణ్  పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించారు. వారాహి పూజ సందర్భంగా కొండగట్టుకు వచ్చినప్పుడు నిధుల సాంక్షన్​ చేయాలని కోరగా, టీటీడీ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేందుకు శనివారం మళ్లీ కొండగట్టుకు రానున్నారు.


ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

పవన్  కల్యాణ్  పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్  నుంచి హెలికాప్టర్  ద్వారా కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్లి అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఘాట్ రోడ్డులో 100 గదుల నిర్మాణానికి కేటాయించిన స్థలంలో భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.

 ఆ తర్వాత కొండగట్టు సమీపంలోని బృందావనం రిసార్ట్‌కు వెళ్లి జనసేన నాయకులు, 
అభిమానులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జేఎన్టీయూ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. పవన్  కల్యాణ్  కోసం ప్రత్యేకంగా గది సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల ప్రారంభమయ్యే పర్యటన మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎండోమెంట్, పోలీస్  అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.