
హైదరాబాద్ సిటీలోని గల్లీగల్లీ అమ్మవారి సేవలో పులకిస్తోంది. జూన్ 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన మూడు వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నగరవ్యాప్తంగా బోనాలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు.జులై 20న ఉదయం అలియబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయానికి బంగారు బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు.
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వైన్‌షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సీపీలు సీవీ ఆనంద్, అవినాశ్మహంతి, సుధీర్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.