ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది.. నా ఫోన్ లాక్కున్నారు : కవిత

ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది.. నా ఫోన్ లాక్కున్నారు : కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)  విచారణ సరిగా లేదని.. వేధింపులకు గురి చేస్తుందంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత. విచారణలో భాగంగా ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని.. శారీరకంగా.. మానసికంగా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రస్తావించారామె. ఇందుకు చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టటమే నిదర్శనం అని  పిటీషన్ లో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. విచారణ సమయంలో తన  ఫోన్ ను  బలవంతంగా లాక్కున్నారంటూ ఈడీ అధికారుల తీరును సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారామె. భౌతికంగా.. మానసికంగా వేధింపులకు గురి చేసే విధంగా అధికారుల ప్రవర్తన ఉందంటూ వాళ్ల వ్యవహార శైలిని కోర్టు ఎదుట.. పిటీషన్ రూపంలో ఉంచారు కవిత.

బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటున్నారని.. ఈడీకి కావాల్సినట్లు వాంగ్మూలం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఈడీ అధికారులపై ఆరోపణలు చేస్తూ.. పిటీషన్ లో ప్రస్తావించారు కవిత. నా విషయంలో ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. మహిళలకు ఉండాల్సిన హక్కులను కాలరాస్తున్నారని.. రాత్రి వరకు విచారణ చేస్తున్నారని పిటీషన్ లో ప్రస్తావించారు కవిత. అధికార పార్టీ ఆదేశాల మేరకే ఇలా ప్రవర్తిస్తున్నారని.. మార్చి 16వ తేదీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటీషన్ వేశారు కవిత. 

ఈడీ అధికారుల విచారణ తీరు బాగోలేదని.. అందర్నీ భయపెట్టి.. వేధింపులకు గురి చేసి వాంగ్మూలాలు తీసుకుంటున్నారంటూ పిటీషన్ లో పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. మొత్తం 150 పేజీల పిటీషన్ లో చాలా అంశాలను ప్రస్తావించారామె. విచారణకు హాజరుకావాల్సిన ఒక్క రోజు ముందు ఈడీ అధికారులపైనే సుప్రీంకోర్టులో  కవిత  పిటీషన్ వేయటం కలకలం రేపుతోంది.