కవిత ఫోన్లు ఓపెన్ చేసి.. డేటా రికవరీ.. తన ప్రతినిధిగా లాయర్ హాజరు

కవిత ఫోన్లు ఓపెన్ చేసి.. డేటా రికవరీ.. తన ప్రతినిధిగా లాయర్ హాజరు

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఫోన్లను ఓపెన్ చేసి.. డేటా రికవరీ చేస్తున్నారు ఈడీ అధికారులు. మార్చి 28వ తేదీ మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత.. తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ ను ఆఫీసుకు పంపించారు. ఫోన్లు ఓపెన్ చేస్తున్నాం.. మీరు హాజరుకావాలంటూ కవితకు సమాచారం ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే తాను రాలేనని.. తన ప్రతినిధిగా లాయర్ సోమా భరత్ ఆథరైజేషన్ గా హాజరవుతారని సమాచారం ఇచ్చారామె. ఈ మేరకు ఆయన ఉదయం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసులోకి వెళ్లారు.

మార్చి 21వ తేదీన లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన కవిత.. తాను ఉపయోగించిన తొమ్మిది ఫోన్లను అధికారులకు అందజేశారు. వాటిని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు అధికారులు. మార్చి 28వ తేదీ ఈ మేరకు టెక్నికల్ టీం సాయంతో.. ఆ ఫోన్లలోని డేటా తీసుకోవటానికి.. కవితను పిలిచారు అధికారులు. అయితే ఆమె హాజరుకాకుండా.. తన ప్రతినిధిని పంపించారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కవిత తొమ్మిది ఫోన్లలోని డేటా రికవరీ సాగుతుంది.

మార్చి 11వ తేదీ ఈడీ విచారణకు హాజరైన సమయంలో.. ఫోన్ల విషయంపై ప్రశ్నించారు అధికారులు. ఈ క్రమంలోనే 21వ తేదీ విచారణకు వెళ్లే సమయంలో వాటిని అందజేశారు.

ఫోన్లలోని డేటా, ఇతర సమాచారాన్ని కవిత లాయర్ సోమా భరత్ సమక్షంలో సేకరించటం.. వాటిని పరిశీలించటం జరుగుతుంది.