నేతన్నల సమస్యలపై ప్రధానికి కవిత పోస్ట్ కార్డ్

నేతన్నల సమస్యలపై ప్రధానికి కవిత పోస్ట్ కార్డ్

మన చేనేత పరిశ్రమ దేశ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజీలేని కృషిచేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటువంటి కీలక పాత్ర పోషిస్తున్న చేనేత పరిశ్రమను ఆసరా అందించి ప్రోత్సహించాల్సింది పోయి.. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపడం సరికాదని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధాని మోడీకి పోస్ట్ కార్డ్ రాసే ఉద్యమాన్ని  మంత్రి కేటీఆర్  ప్రారంభించారని గుర్తు చేశారు. దానికి తన సంఘీభావాన్ని కవిత ప్రకటించారు.

ఈనేపథ్యంలోనే తాను కూడా చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధాని మోడీకి పోస్ట్ కార్డ్ రాశానని తెలిపారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్  చేశారు. ఇక ‘చేనేత రంగాన్ని రక్షించుకుందాం’ అనే పిలుపుతో https://www.change.org/  వెబ్ సైట్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఒక పిటిషన్ లింక్ ను కవిత తన ట్వీట్ లో షేర్ చేశారు. దానిపై ప్రతి ఒక్కరు సైన్ చేయాలని కోరారు. ఈ లింక్ ను స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.  కాగా, బై పోల్ జరుగుతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేనేత కార్మికులు అత్యధిక  సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకొని రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి.