నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు : కవిత

నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు : కవిత

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా.. దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నది కాంగ్రెసే అని మండిపడ్డారు. ప్రవల్లిక ఆత్మహత్యను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయం చేయడం సరికాదని ట్విట్టర్​లో విమర్శించారు.

ప్రవల్లిక సూసైడ్ బాధాకరమన్నారు. బతుకమ్మను కించపర్చేలా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై మండిపడ్డారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి.. రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్ వాటిని ఛేదించి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. గ్రూప్–2 ఎగ్జామ్ వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీలో కోరితే, రేవంత్ రెడ్డి ట్విట్టర్​లో డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు.

బతుకమ్మ పాట పాడిన కవిత

ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పాట పాడారు. పది పాటలతో భారత్ జాగృతి రూపొందించిన ఆల్బమ్​ను శనివారం విడుదల చేశారు. ఈ పాటలను యూ ట్యూబ్​లో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘‘ఒక్కొక్క ముత్యం..”అనే పాటను గాయకులతో కలిసి కవిత పాడారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.