జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కవిత మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. జైల్లో పెడితే  ఏమైతదన్న ఆమె.. ప్రజల కోసం పనిచేయడం మానుకోమని స్పష్టం చేశారు. ప్రజల కోసం పని చేస్తున్నందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు వస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అంతేతప్ప  మీడియాకు లీకులిచ్చి రాజకీయ నాయకుల మంచి పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పి కొడతారని మోడీకి హితవు పలికారు.

8 ఏండ్లలో 9 ప్రభుత్వాలు కూల్చింది..

మోడీ అధికారం చేపట్టిన 8 ఏండ్లలో దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్నారని కవిత విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా అక్కడ మోడీ రాక ముందు ఈడీ రావడం సర్వ సాధారణమని అన్నారు. వచ్చే డిసెంబర్ లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందునే ఇప్పుడు ఈడీ వచ్చిందని ఆరోపించారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలని, ప్రజలకు ఏం చేస్తామన్నది చెప్పుకొని గెలవాలె తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడి కాదని కవిత చెప్పారు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామన్న కవిత బీజేపీ వైఫల్యాలను ఎండగడతామని తేల్చిచెప్పారు.

మోడీకి ముందు ఈడీ

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏడాది ముందు ఈడీ రావడం కామన్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని కాబట్టి..మోడీ కంటే ముందు రాష్ట్రానికి ఈడీ వచ్చిందని విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఈడీ తన పేరును ప్రస్తావించడాన్ని పట్టించుకోనన్నారు. ఎలాంటి విచారణను అయినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తనతో పాటు..టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐని ప్రయోగించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈడీ, సీబీఐలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని..అయితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ ఆగడాలు ఇక్కడ అది నడవవని  తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ గమనించాలని చెప్పారు. ప్రజలు తమ వెంట ఉన్నంత కాలం బీజేపీ ఆటలు సాగవన్నారు.