
ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నాయకులెవరూ స్పందించలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తనపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోపించారు. తనపైఅనుచితమైన వ్యాఖ్యలు చేస్తే.. యావత్ తెలంగాణ బిడ్డలు బాధపడ్డరు.. కానీ బీఆర్ఎస్ అన్నదమ్ములు రియాక్ట్ కాలేదన్నారు. తనపై వ్యాఖ్యలు చేయించి ఆ పెద్ద నాయకుడు శునకానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
ఆదివారం (ఆగస్టు 03) ప్రెస్ మీట్ లో భాగంగా కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పది మందిని పెట్టి తన దగ్గర సమాచారం తీసుకుంటున్నామని చావు తెలివితేటలు చూపిస్తున్నారని.. కానీ అక్కడేం జరుగుతుందో తనకు కూడా సమాచారం వస్తుందని అన్నారు కవిత. తనను ఒంటరి చేసి శునకానందం పొందాలనుకుంటే.. వాళ్లకు కూడా అది జరుగుతుంని అన్నారు.
కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీ ఫూట్ ఎవరు:
నల్గొండలో బీఆర్ఎస్ ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కవిత. నల్గొండ జిల్లాలో ఆ నాయకుడు చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఒక్కరు గెలిచారని.. ఆయన ఒక్కరు గెలిచి మిగతావారి ఓటమికి కారణమయ్యారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయించారు. నల్గొండ జిల్లాలో ఒక లిల్లీపూట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన వ్యక్తి నాపై ఆరోపణలు చేయడమేంటి. ఆ లిల్లీ ఫూట్ ప్రజా ఉద్యమాలు ఎన్నడూ చేయలేదు.. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీ ఫూట్ ఎవరు.. అని కవిత మండిపడ్డారు.
బీజేపీ ధర్నా చేయడం కామెడీ:
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ధర్నా చేయడం కామెడీగా ఉందని అన్నారు కవిత. గవర్నరే బీజేపీకి చెందిన వ్యక్తి. ఆయన ఎందుకు సంతకం చేయడంలేదు. బీజేపీ వాళ్లు ధర్నా చేయడం.. దొంగనే దొంగ అన్నట్లుంది.. బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్రం మంత్రులు ఉన్నారు.. కేంద్రంపై ఒత్తిడి చేసి బీసీ బిల్లు పాస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు కవిత.
కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తేనే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందని అన్నారు కవిత. అందుకే దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ల వైఖరిని దీక్ష లో వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.