
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవనున్నారు. ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై న్యాయవాదులతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈడీ విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరవనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో కలిసి ఆదివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ విచారించింది. ఆ తర్వాత మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాత్రి 8.05 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఇదే సమయంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించారు. దీంతో సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడిని కూడా అరెస్ట్ చేసింది.