- వాళ్లు ప్రపంచంలోనే అత్యధిక ప్రజాధనం దోచుకున్నరు: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: అత్యధిక ప్రజా ధనాన్ని దోచుకున్న కుటుంబం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే.. అది కేసీఆర్‌దే అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆయన ఫ్యామిలీ జైలుకెళ్లడం పక్కా అని అన్నారు. రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు.
సోమవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కువ ప్రజా ధనాన్ని లూటీ చేసింది కేసీఆర్ కుటుంబమే.. ప్రజలు కోరుకుంటున్నట్టే కేసీఆర్ అవినీతిని బయటికి తీస్తాం. ఆయన ఫ్యామిలీ అవినీతిలో సహకరించిన అధికారులను కూడా జైలుకు పంపుతాం. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నవారికే కేసీఆర్ పాలనలో కాంట్రాక్టులు దక్కాయి’’అని విమర్శించారు.
