వరద బాధితులకు సాయం అందించాం

వరద బాధితులకు సాయం అందించాం

రాష్ట్రంలో అతివృష్టి ,గోదావరి పరివాహాక ప్రాంతాల్లో  వరదలపై తెలంగాణ శాసన మండలిలో షార్ట్ డిస్కషన్ జరిగింది. జులై మాసంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గత 35 ఏండ్ల చరిత్రలో గోదావరికి 29 లక్షల క్యూసెక్కుల పైగా వరద రాలేదన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదన్నారు. వరదల సమయంలో  మంత్రులు, అధికారులు ఆయా ప్రాంతాల్లోనే మకాం వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. 

వరద బాధితులకు అన్ని విధాలా సాయం చేశాం 

2014 నుంచి 2020 వరకు కట్టిన ప్రాజెక్టులు, కరకట్టలు వల్లనే గోదావరి వరద ముప్పు నుంచి బయటపడ్డామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గోదావరి దాని ఉపనదులు వరదలకు ఉప్పొంగడంతో కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద పోటెత్తిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ బాధితులకు తక్షణ సాయం అందించేలా  రూ.10 వేల నష్టపరిహారం , 25 కిలోల బియ్యం, ఐదు కేజీల కందిపప్పు అందజేశామన్నారు. వరదల సమయంలో గ్రామాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చూపించాలని బాధితులు సీఎంను కోరారు. వెంటనే స్పందించిన కేసీఆర్ రాకీయాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

వరద బాధితులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు

వర్షం, వరదలను లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ బస్సులో దాదాపు 800 కిలోమీటర్లు పర్యటించారని తెలిపారు. వరద బాధితుల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారి బాధలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.