మెదక్​ టికెట్​ రేసులో ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి

మెదక్​ టికెట్​ రేసులో ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి
  • నర్సాపూర్ టికెట్​ ఆశిస్తున్న మాజీ మంత్రి సునీతారెడ్డి
  • పద్మా దేవేందర్​రెడ్డి, మదన్ రెడ్డి లకు టికెట్​ దక్కేనా?
  • సంస్థాగత నిర్మాణం మీద బీజేపీ ఫోకస్​
  • ప్రజాసమస్యలపై కాంగ్రెస్​ ఆందోళనలు
  • రూలింగ్​ పార్టీని కలవరపెడ్తున్న పెండింగ్​ హామీలు

మెదక్​, వెలుగు: మెదక్​ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యేలను ఇంటిపోరు భయపెడుతోంది. ఈసారి కూడా సిట్టింగ్​లకే టికెట్లు ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్​ ప్రకటించినా.. ఎమ్మెల్యేల్లో కలవరం తగ్గడం లేదు. వరుసగా రెండుసార్లు గెలిచిన వారిపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.  మెదక్​ నుంచి పద్మా దేవేందర్​రెడ్డి, నర్సాపూర్​నుంచి మదన్​రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మెదక్​ నుంచి కేసీఆర్​ పొలిటికల్​సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, నర్సాపూర్​ నుంచి మాజీ మంత్రి, మహిళా కమిషన్​ చైర్​పర్సన్​సునీత లక్ష్మారెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు. వీరిద్దరికీ సీఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. సునీతను నర్సాపూర్​ టికెట్​ ఇస్తామన్న హామీతోనే  పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.  దీంతో చివరి నిమిషంలో తమ టికెట్​ కట్​కావచ్చునన్న భయం సిట్టింగులను వెన్నాడుతోంది. లోపల అనుమానాలున్నా పైకి మాత్రం ఎమ్మెల్యేలిద్దరూ ధీమాగానే ఉన్నారు.  టికెట్​ తమకే వస్తుందని, ఎన్నికలకు రెడీ కావాలని కేడర్​కు చెప్తూ ప్రచారానికి రెడీ అవుతున్నారు. 

పట్టు కోసం ప్రతిపక్షాల ప్రయత్నం 

రూలింగ్ పార్టీని ఎదుర్కొని.. సత్తా చాటాలని కాంగ్రెస్​, బీజేపీ సన్నద్ధమవుతున్నాయి. మెదక్​, నర్సాపూర్​లో వరుసగా రూలింగ్​పార్టీ రెండుసార్లు గెలవడంతో ఇక్కడ  కాంగ్రెస్​, బీజేపీ కొంత వెనకబడ్డాయి. లోకల్​బాడీల్లోనూ  బీఆర్ఎస్​కు చెందినవారే పదవుల్లో ఉండడం, సంస్థాగతంగా కూడా  పటిష్టంగా ఉండడం రూలింగ్​ పార్టీకి కలిసివచ్చే అంశాలు.  పటిష్టమైన నాయకత్వం లేక  కాంగ్రెస్​, బీజేపీ వీక్​గా ఉన్నాయి. ఈ బలహీనత నుంచి బయటపడేందుకు బీజేపీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.  గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటుతో యాక్టివిటీ పెంచింది. బూత్ లెవల్​ నుంచి పార్టీని పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అన్నిమున్సిపాలిటీలు, గ్రామాల్లో బూత్​ కమిటీలు, శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి బూత్ కమిటీ కన్వీనర్లు శక్తి కేంద్రాల ఇన్​చార్జిలకు ట్రైనింగ్​ ఇచ్చింది. ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వ ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు స్ట్రీట్​కార్నర్​మీటింగ్​లు నిర్వహిస్తోంది. కాంగ్రెస్​ ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేస్తోంది. నియోజకవర్గ లీడర్లు హాత్​సే హాత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వీటికి తోడు సర్కారు మీద వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 

టికెట్​ కోసం పోటాపోటీ

టికెట్ల కోసం కాంగ్రెస్, బీజేపీల్లోనూ చాలామంది క్యూ  కడుతున్నారు.  మెదక్  కాంగ్రెస్​ టికెట్ ను డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ లీడర్​మ్యాడం బాలకృష్ణ, చౌదరి సుప్రభాత రావు ఆశిస్తున్నారు. ఎవరికి వారే సీనియర్​ నేతలను కలుస్తూ టికెట్​ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్​తాళ్లపల్లి రాజశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్​ రెడ్డి, మాజీ మంత్రి కరణం రాంచందర్​ రావ్​ కోడలు పరిణిత టికెట్ ఆశిస్తున్నారు. నర్సాపూర్​లో   కాంగ్రెస్​ టికెట్​ రేసులో టీపీసీసీ నాయకులు ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్​, సోమన్నగారి రవీందర్​ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు  మెదక్​ పార్లమెంట్​కాంగ్రెస్​ ఇన్​చార్జి  గాలి అనిల్​కుమార్​అవకాశం ఉంటే  నర్సాపూర్​నుంచి బరిలో దిగాలన్న  ఆలోచనతో ఉన్నారు.  
బీజేపీ నుంచి  నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మన్​ మురళీ యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్​ వాల్దాస్​ మల్లేశ్​ గౌడ్​ 
ఆశిస్తున్నారు. 

మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి

అనుకూల అంశాలు

    ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు సమస్యల పరిష్కారంకోసం క్యాంప్​ ఆఫీస్​లో నెలకు రెండు సార్లు 'మీకోసం' కార్యక్రమం నిర్వహించడం
    అత్యసరవైద్య సేవలు అవసరమైన వారికి ఎల్​ఓసీ, సీఎంఆర్​ఎఫ్​ కింద ఆర్థిక సహాయం అందించడం
    ప్రతిపక్ష పార్టీలు బలంగా లేకపోవడం, కాంగ్రెస్​, బీజేపీలో బలమైన పోటీదారులు లేకపోవడం.

ప్రతికూల అంశాలు

  •     సెకండ్​ క్యాడర్​ లీడర్లు ఎదగడానికి చాన్స్​ ఇవ్వకపోవడం
  •     సీఎం పొలిటికల్​ సెక్రటరీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి దాదాపు రెండేళ్లుగా స్థానికంగా ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేయడం
  •     డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లు కొందరికి మాత్రమే కేటాయించడం, పోడు, పార్ట్​ బీ భూముల సమస్య పరిష్కారం కాకపోవడం.

నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి  

అనుకూల అంశాలు 

  •     వివాద రహితుడుగా పేరు, సాయంకోరి వచ్చేవారికి అన్ని రకాలుగా సహకరించడం
  •     ముఖ్యమంత్రి కేసీఆర్​తో సన్నిహిత సంబంధాలు ఉండటం

ప్రతికూల అంశాలు

  •     నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా ఉండటం
  •     పోడు, పార్ట్​ బీ భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడం
  •     మాజీ మంత్రి, మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతారెడ్డి టికెట్​ ఆశిస్తుండటం

తీరని సమస్యలు

మెదక్ జిల్లాలో  పోడు భూములు, పార్ట్​బీ భూముల సమస్య తీవ్రంగా ఉంది. మెదక్​ నియోజకవర్గంలోని హవేలి ఘనపూర్, మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో, నర్సాపూర్​నియోజకవర్గంలో శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, చిలప్​చెడ్​మండలాల్లో ​వేలాది మంది పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా అప్లికేషన్లు రిజెక్ట్​ చేయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.  శివ్వంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో వందలాది ఎకరాల భూములను పార్ట్​ బీలో చేర్చడంతో కొత్త పట్టా పాస్​బుక్ లు అందక రైతు బంధు, రైతు బీమా వంటి స్కీంలను చాలామంది రైతులు  పొందలేకపోతున్నారు.

ఇంకా..

  • మెదక్​ - నర్సాపూర్​ సరిహద్దులో ఉన్న వనదుర్గా ప్రాజెక్ట్​ (ఘనపూర్​ ఆనకట్ట) ఎత్తు పెంపు పనులు దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.   
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మెదక్, నర్సాపూర్​పరిధిలోని  మండలాలకు సాగు నీటిని అందించేందుకు చేపట్టిన కాల్వల పనులు పూర్తి కాలేదు. వెల్దుర్తి, నర్సాపూర్​ మండలాల్లో కొంత మేర కాల్వల, సొరంగం నిర్మాణం జరిగింది. చిన్న శంకరంపేట మండలంలో ఇటీవల పనులు షురూ అయ్యాయి. శివ్వంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పనులు మొదలే కాలేదు.
  • రెండు నియోజకవర్గాలలో డబుల్ బెడ్​ రూమ్​ ఇండ్లు కొద్ది మందికే అందాయి. అనేకచోట్ల ఇండ్ల  నిర్మాణం చాలాకాలంగా అసంపూర్తిగా ఉంది.   
  • మెదక్ పట్టణానికి రింగ్​ రోడ్డు నిర్మాణం, మెదక్​ పట్టణంతోపాటు, రామాయంపేట, కౌడిపల్లిలో మినీ ట్యాంక్​ బండ్ పనులు సగంలోనే ఆగిపోయాయి. మెదక్, రామాయంపేటలో మెయిన్​ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.